ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమ్ ఆద్మీ నేతలు మండిపడ్డారు.మనీశ్ సిసోడియా మెడపై ఓ పోలీస్ అధికారి చేయి వేసి లాక్కుపోవడంపై వారు మండిపడుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఏకంగా ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. మనీశ్ సిసోడియాను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆయనకు జూన్ 1వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. అనంతరం సిసోడియాను జైలుకు తరలిస్తుండగా మీడియా ఎదురొచ్చింది.
ఢిల్లీలో అధికారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య కొనసాగుతున్న వివాదాన్ని సిసోడియా ముందు ప్రస్తావించి అభిప్రాయం కోరింది. ఈ సందర్భంగా పోలీసులు మీడియాను వెనక్కి నెట్టేశారు. అయినా సిసోడియా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మరింత అరాచక శక్తిగా మారుతున్నారని, ఆయనకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. ఇంకా ఏదో మాట్లాడబోతుండగా పోలీస్ అధికారి ఏకే సింగ్ అడ్డుపడి ఆయన మెడపై చేయి వేసి లాక్కెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేజ్రివాల్ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘పోలీసులకు మనీశ్ సిసోడియాపట్ల ఆవిధంగా వ్యవహరించే హక్కు ఉందా.. . వారిని ఈ విధంగా ప్రవర్తించమని వారి పైవాళ్లు (కేంద్రం) ఆదేశించారా.. అని ట్విటర్‌లో ప్రశ్నించారు. మనీశ్ సిసోడియాపట్ల దురుసుగా వ్యవహరించారంటూ ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు కొట్టిపారేస్తున్నారు. అందులో ఢిల్లీ పోలీసుల తప్పేమీ లేదని పేర్కొన్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మీడియాతో మాట్లాడే అర్హత ఉండదని, అందుకే మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతుంటే మాట్లాడకుండా అడ్డుపడి ముందుకు తీసుకెళ్లారన్నారు.