Friday, November 22, 2024

పాదయాత్ర ఫార్ములా వర్క్ ఔట్ అయ్యేనా?

తెలుగునాట‌ పాద‌యాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పాదయాత్ర రాజ‌కీయాల్లో విజ‌యానికి ద‌గ్గ‌రి దారిగా ఉంటూ వ‌చ్చింది. ఈ పాదయాత్రతో చరిత్రలు సృష్టించి అధికారం చేపట్టారు. పాద‌యాత్ర చేస్తే అధికారం ద‌క్కుతుంద‌నే పాత సెంటిమెంట్ స్ట్రాటజీ.. తెలంగాణ‌లోని విప‌క్ష నేత‌లను తెగ ఊరిస్తోంది. తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ.. ఈ సారైనా అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీలు.. పాదయాత్రనే తమ విజయానికి తొలి మెట్టుగా భావిస్తున్నాయి. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ వ‌ర్కవుట్ అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

తెగులునాట గ‌త అనుభ‌వాల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌తిప‌క్ష నేత ఒక్క‌రే పాద‌యాత్ర‌లు చేస్తూ వ‌చ్చారు. అధికారాన్ని ద‌క్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నాడు వైఎస్ పాదయాత్రతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి 2004లో అధికారంలోకి వచ్చారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దానినే ఫాలో అయ్యారు. విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో వైఎస్ జ‌గ‌న్.. ఇలా ఒక్క‌రొక్క‌రే పాద‌యాత్ర‌లు చేసుకుంటూ వ‌చ్చారు. అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోగ‌లిగారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయంటే అందుకు వైఎస్ జగన్ చేసిన పాదయాత్రనే కారణం. అయితే, తెలంగాణ‌లో ఇప్పుడు అందుకు భిన్న‌మైన పరిస్థితి నెలకొనేలా ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్రలకు సిద్ధమవుతుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్ప‌టికే పాద‌యాత్రకు సంబంధించిన క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఆగస్ట్ 9 నుంచి ఆయన మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మొదలైయ్యే పాదయాత్ర హుజురాబాద్ వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను కూడా కాషాయ దళం సిద్ధం చేస్తోంది. ఇక, టీ.పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా త్వ‌ర‌లో పాద‌యాత్ర చేస్తాన‌ని ఇటీవల ప్ర‌క‌టించారు. అయితే ఎప్పుడు, ఎలా అనేది అధిష్టానం నిర్ణ‌యిస్తుంద‌ని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే చిన్న‌పాటి పాద‌యాత్ర చేశారు. రైతులకు మద్దతుగా అచ్చంపేట నుంచి హైదరాబాద్‌ వరకు ఆయన పాదయాత్ర చేశారు. దానికి అనూహ్య‌మైన స్పంద‌న వచ్చింది. దీంతో ఆయ‌న మ‌రింత ఉత్సాహంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టించాల‌ని భావిస్తున్నారు.

ఇక‌ తెలంగాణలో రాజన్న రాజం తెస్తానంటూ పాలిటిక్స్ లోకి దిగిన వైఎస్ షర్మిల కూడా పాద‌యాత్ర చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్న జ‌గ‌న్ కోసం పాద‌యాత్ర చేసిన అనుభ‌వం ఆమెకు ఉంది. అయితే, ఈసారి ఆమె సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పేరును జులై 8న ప్రకటించబోతున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ శిష్య బృందంలోని సభ్యురాలిని ఆమె వ్యూహకర్తగా ఏర్పాటు చేసుకోవడం ఆసక్తిగా మారింది. గతంలో పీకే వ్యూహాలతో ఏపీలో వైఎస్ జగన్ పార్టీ 151 సీట్లు గెలిచింది. ఇప్పుడు షర్మిలకు ఆ టీమ్ వర్క్ చేయడంతో ఆసక్తి నెలకొంది. పీకే టీమ్ సూచన మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేయాలని షర్మిల భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తన తండ్రి వైఎస్ఆర్ పాదయాత్ర మొదలు పెట్టిన చేవెళ్ల నుంచే షర్మిల కూడా పాదయాత్ర మొదలు పెట్టే అవకాశం ఉంది.

అయితే, ఇంత మంది  నేత‌లు పాద‌యాత్ర‌కు సిద్ధం కావ‌డంతో.. పాత ఫార్ములా ప‌నిచేస్తుందా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు విప‌క్షాల మ‌ధ్యే చీలిపోతే… అది అధికార పార్టీకే లాభాన్ని చేకూర్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండున్నరేళ్ల సమయం ఉంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలను కవర్ చేస్తూ పాదయాత్ర చేయాలంటే కనీసం 8-10 నెలల సమయం పడుతుంది. దీంతో అందుకు తగినట్లు ఆయా పార్టీలు పాదయాత్రను ప్రణాళిక బద్దంగా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి పాదయాత్ర ఏ ప్రతిపక్ష పార్టీకి పాదయాత్ర కలిసి వస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

ఇది కూడా చదవండి: అధికారుల తీరుపై కేసీఆర్ అసహనం.. రిబ్బన్‌ను పీకి పడేసిన సీఎం!

Advertisement

తాజా వార్తలు

Advertisement