Tuesday, November 19, 2024

డబుల్ మాస్క్ ధరిస్తే కరోనా రాదా?

కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. కరోనా వైరస్‌ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు కచ్చితంగా ధరించాలని అందరికీ తెలుసు.  రెండు మాస్కులు ధరిస్తే రెండింతల రక్షణ లభిస్తోందని తెలుసా? ఇలా ధరిస్తే వైరస్‌ బారినపడే అవకాశాలే లేవని ఓ పరిశోధనలో తేలింది.

దేశంలో మాస్కుల వినియోగం తప్పనిసరి చేసింది కేంద్రం. ఇళ్ల నుంచి బయటకు వస్తే  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్తర్వులు జారీ చేశాయి. గతంలో కరోనా గాల్లో వ్యాపించదని, రోగి ముట్టుకున్న చోట ముట్టుకుని, నోరు ముక్కు,కళ్లు ముట్టుకుంటే వస్తుందని ప్రచారం చేసారు. శానిటైజ్ చేసుకోమన్నారు. కానీ ఇప్పుడు కరోనా కొత్త వెర్షన్ గాల్లో మూడు గంటల సేపు వుంటుందని అంటున్నారు. మరి అలాంటపుడు మాస్కులు రక్షణగా నిలుస్తాయి. అయితే, డబుల్ మాస్కులు వేసుకుంటేనే కరోనా రాదని చెబుతున్నారు. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో రెండు మాస్కుల వాడ‌కాన్ని ఆరోగ్య నిపుణులు ప్రోత్సహిస్తున్నారు.

Miquel Llonch/Stocksy United

దేశంలో మాస్క్ ల విషయంలో చిత్రంగా వుంది వ్యవహారం. ఎన్ 95 మాస్క్ లు తప్ప మరొకటి పని చేయవని నిపుణులు చెబుతున్నారు. కానీ రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ ఎలాంటి మాస్క్ లు పడితే అలాంటి మాస్కలు విక్రయిస్తుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. జనాలు మాస్క్ పెట్టుకోవాలన్నది నిబంధన కాబట్టి, ఏదో ఒకటి మొహానికి తగిలించుకుంటున్నారు. దీని వల్ల ఫలితం ఏముంటుంది? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మాస్క్ తప్పనిసరి చేస్తూ రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు సత్ఫలితాలు ఇచ్చాయని నిపుణులు గుర్తించారు. మాస్కులు ధరించడం మస్ట్ అనే ఆదేశాలు ఇవ్వడానికి ముందు, ఇచ్చిన తర్వాత.. ఎన్ని కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి అనే దానిపై స్టడీ చేయగా, విస్తుపోయే విషయం వెలుగు చూసింది. మాస్క్ మస్ట్ ఆదేశాల తర్వాతే పరిస్థితిలో మార్పు వచ్చిందని, కొత్త కొవిడ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గిందని అధ్యయనకర్తలు గుర్తించారు.

 రెండు టైట్‌ ఫిట్‌ మాస్కులు సార్స్‌–కోవ్‌–2 సైజ్‌ వైరస్‌ను సమర్థంగా ఫిల్టర్‌ చేస్తాయని, నోరు, ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)  పరిశోధన చెబుతోంది. మాస్కుల్లో ఎక్కువ బట్ట పొరలు వాడడం వల్ల వాటి మధ్య ఖాళీ స్థలం తగ్గిపోతుంది. ఖాళీ లేకపోతే లోపలికి వైరస్‌ ప్రవేశించే ఆస్కారం ఉండదు. కనుక వైరస్‌ కణాలను ఇది సాధ్యమైనంత వరకు అడ్డుకుంటుంది.  మాస్కు ముఖానికి సరిగ్గా అమరకపోతే రక్షణ పెద్దగా ఉండదు. కనుక డబుల్ మాస్కును ధరించడం వలన ముఖ భాగాన్ని వీలైనంత కవర్‌ చేస్తుంది. ఇందులో బట్ట పొరలను ఖాళీ లేకుండా బిగువుగా కలిపి కుట్టిన మాస్కు ఉత్తమమైనదని చెప్పారు.

- Advertisement -

సాధారణ క్లాత్‌ మాస్క్‌ 56.1 శాతం రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్‌ మాస్కు అయితే 51.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్‌ మాస్కుపై      క్లాత్‌మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందన్నారు. క్లాత్‌ లేదా సర్జికల్‌ మాస్కు వలన 77 శాతం రక్షణను ఇస్తుంది. డబుల్ మాస్కులు  వాడకం వలన మీకు శ్వాస పీల్చుకోవడంలో ఏ రకంగాను ఇబ్బందులు ఉండవు. వాడేసిన మాస్కులు రెండింటినీ గానీ, సర్జికల్ మాస్కులు రెంటిని కలిపి డబుల్ మాస్కులా వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో దొరుకుతున్న ఎన్‌95 మాస్క్‌ను ఏ ఇతర మాస్కు తో ఉపయోగించరాదు. రసాయన పదార్థాలను మాస్కు కు కలిపి ఉపయోగించరాదు. పాడైన, రంధ్రాలు పడినమాస్కులను వాడరాదని తెలిపారు.  డబుల్ మాస్కింగ్.. వస్త్రం, స‌ర్జిక‌ల్ మాస్క్‌ ల‌తో గాలి లీకేజీని నివారించవచ్చు. అలాగే, ముఖం ఆకృతులను డ‌బుల్ మాస్క్‌ లు బాగా సరిపోతాయి. డబుల్ మాస్కింగ్ కొవిడ్-19 కు గురికావడాన్ని దాదాపు 95 శాతం తగ్గించినట్లు యూఎస్ సీడీసీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement