చిత్రపరిశ్రమలో నెలకొన్న కొన్ని కారణాలతో టాలీవుడ్ లో షూటింగులు ఆగిపోయాయి. షూటింగుల బంద్ కు పలు సినీ సంఘాల మద్దతు కూడా ఉంది. అయితే.. ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి మళ్లీ షూటింగ్ లు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. కాగా, దీనిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో షూటింగులు ఉంటాయని ఆయన వెల్లడించారు. షూటింగ్ లు మళ్లీ ప్రారంభం కావడంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. 23 రోజులుగా సినీ రంగ సమస్యలపై చర్చించినట్టు వివరించారు. ఆగస్టు 30న తుది నిర్ణయంపై ప్రకటన ఉంటుందని దిల్రాజు చెప్పారు.
ఇక.. అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలు ఉంటాయని, పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని దిల్ రాజు చెప్పారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు వీపీఎఫ్ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. విదేశాల్లో చిత్రీకరణలు జరుపుకుంటున్న చిత్రాలు ఆగస్టు 25 నుంచి షూటింగులు జరుపుకోవచ్చని తెలిపారు. అత్యవసరమైతే ఫిలిం చాంబర్ అనుమతితో ఆగస్టు 25 నుంచి చిత్రీకరణలు జరుపుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు.