Thursday, November 21, 2024

రాసలీలల ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వండి: అభిమానుల వినూత్న నిరసన

కర్నాటక రాజకీయాల్లో మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి రాసలీలల వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. శృంగార వీడియోలలో ఉన్న మంత్రి రమేష్‌ జార్కిహోళి తన పదవికి రాజీనామా చేశారు. అయితే, తాజాగా రమేష్‌ కు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు ఆందోళన నిర్వహించారు. కర్నాటకలోని బెల్గావిలో ఓ వినూత్న ర్యాలీ చేశారు. బెల్గావి ఎమ్మెల్యే రమేష్‌ జార్కిహోళికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాలంటూ ఆయ‌న అనుచ‌రులు ఒంటెల‌తో నిర‌స‌న‌ను తెలిపారు. దళిత్ కాంత్రి సేన ఆధ్వర్యంలో ఆరు ఒంటెలపై విహరిస్తూ మాజీ మంత్రి రమేష్ కి అనుకూలంగా ఆయన అభిమానులు నినాదాలు చేశారు. రమేష్‌ జార్కిహోళిని నీటిపారుదల మంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలను బిజెపి గుర్తించాలని దళిత్ క్రాంతి సెన అధ్యక్షుడు అశోక్ కుమార్ అసోడ్ కోరారు.

గోలక్‌లో బిజెపికి 28,000 ఓట్ల ఆధిక్యం రావడానికి రమేష్‌ జార్కిహొళినే కారణమని ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది బెలగావిలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ గెలవడానికి సహాయపడిందన్నారు. కానీ కొందరు బీజేపీ నాయకులు అన్యాయంగా రమేష్‌ జార్కిహొళిపై కుట్ర చేసి రాజీనామా చేయాలని బలవంతం చేశారని ఆరోపించారు.

ర్యాలీలో పాల్గొన్నవారు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రికి మెమోరాండం పంపారు. మెమోరాండం కాపీలను ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర బీజేపీ చీఫ్ నలీన్ కుమార్ కతీల్ వంటి సీనియర్ నాయకులకు పంపుతామని అసోడ్ చెప్పారు.

కాగా, రాసలీలల వ్యవహారం ఇరుక్కున్న ఎమ్మెల్యే రమేష్‌ జార్కిహొళి గతంలో యడియూరప్ప కేబినెట్ లో జలవనరులశాఖ మంత్రిగా పని చేశారు. అయితే, రాసలీలల ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 3న ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కర్నాటక పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(కేపీటీసీఎల్‌)లో ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన యువతిని లొంగదీసుకున్న మంత్రి రమేష్‌ జార్కిహొళి ఆమెతో రాసలీలలు జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి. యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియో బయటకు లీక్ అవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ తరచు ఏదో ఓ వివాదం వెంటాడుతోంది. ఈ క్రమంలో బీజేపీకి రమేష్‌ జార్కిహొళి వ్యవహారం తొలనొప్పిగా మారింది. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో రమేష్‌ జార్కిహొళి అత్యంత కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలను సమీకరించి వారితో తిరుగుబావుటా లేవనెత్తించి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించిన సమయంలో రమేష్‌ జార్కిహొళి అత్యంత కీలకంగా వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement