Tuesday, November 26, 2024

Big Story: కాగ్ రిపోర్ట్: 272 కోట్ల ఆమ్దానీతో టాప్లో సింగరేణి.. అటవీ అభివృద్ధి లాభం రూ.51 కోట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు 59,856 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని ఈ సంస్థల పని తీరును సత్వరమే సమీక్షించి లాభాల బాట పట్టేందుకు చర్యలు తీసుకోవాలని కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక పని తీరును విశ్లేషించిన కాగ్‌ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. 30 ప్రభుత్వ రంగ సంస్థల్లో 12 సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో లాభాలను అర్జించాయని శాసనసభకు కాగ్‌ సమర్పించిన నివేదికలో తెలిపింది. 16 సంస్థలు నష్టాల బారిన పడినట్లు వివరించింది. 2021 మార్చి నాటికి 30 ప్రభుత్వ రంగ సంస్థల పని తీరును సమీక్షించగా ఆ సంస్థలు రూ.60వేల కోట్ల నికర నష్టాల్లో ఉన్నట్లు కాగ్‌ తేల్చింది. నష్టాల పాలవుతున్న సంస్థల పని తీరును సత్వరమే సమీక్షించాలని ఆర్థికపరమైన మెరుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
రాష్ట్రంలో 82 ప్రభుత్వరంగ సంస్థలు ఉండగా అందులో 66 సంస్థలు మాత్రమే పని చేస్తున్నాయని కాగ్‌ తెలిపింది.
ఈ 66లో ఎనిమిది సంస్థలు విద్యుత్‌ రంగానికి సంబంధించినవని పేర్కొంది. 2020-21 సంవత్సరంలో ఆయా సంస్థల ఆర్థిక పని తీరు విశ్లేషణకు 30 సంస్థలు మాత్రమే కాగ్‌కు సమాచారం అందించాయని నివేదికలో తెలిపింది. ఆ సమాచారం ఆధారంగా ఆయా సంస్థల ఆర్థిక పని తీరును అధ్యయనం చేసిన కాగ్‌ పలు అభ్యంతరాలతో పాటు సిఫారసులతో కూడిన నివేదికను అందజేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 30 ప్రభుత్వ రంగ సంస్థల టర్నోవర్‌ రూ.66,316 వేల కోట్లు ఉందని కాగ్‌ తెలిపింది. ఈ టర్నోవర్‌ రాష్ట్ర తలసరి ఆదాయంలో 6.76 శాతంగా పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే టర్నోవర్‌ 10.41 శాతం తగ్గిందని వివరించింది. కరోనా మహమ్మారి కారణంగా బొగ్గుకు డిమాండ్‌ తగ్గి గత సంవత్సరంకన్నా సింగరేణి సంస్థలకు 37 శాతం రాబడి తగ్గిందని గత ఏడాదితో పోలిస్తే 5,921 కోట్లు ఆదాయాన్ని సింగరేణి కోల్పోయిందని పేర్కొంది. కరోనాతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ ఆర్టీసీ) టర్నోవర్‌ 44 శాతం తగ్గి ఆదాయం 1630 కోట్లకు పడిపోయిందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.

ముప్పై ప్రభుత్వరంగ సంస్థల్లో 2021 మార్చి చివరి నాటికి 1.20 లక్షల కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం మూలధనం వాటా పెట్టుబడి 38వేల కోట్లని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో ఏ ఒక్క సంస్థను ప్రైవేటీకరించలేదని, పెట్టుబడులను ఉపసంహరించలేదని తెలిపింది. ఒకే సంస్థల్లో 2020-21లో 12 సంస్థలు మాత్రమే 728 కోట్లు లాభాలను అర్జించాయని 16 సంస్థలు ఏకంగా 10,295 కోట్ల నష్టాలను చవి చూశాయని పేర్కొంది. 2021 మార్చి 31వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నికర నష్టాలు 59,856 కోట్లు కాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ నికర లాభం 772 కోట్లని తెలిపింది. తెలంగాణ జెన్‌కో 168 కోట్లు, ట్రాన్స్‌కో 206 కోట్లు లాభాలను అర్జించాయని వివరించింది. అటవీ అభివృద్ధ సంస్థ గత ఏడాది 51 కోట్ల లాభాలతో ఉందని కాగ్‌ నివేదికలో పేర్కొంది. దక్షిణ డిస్కంలు 4,622 కోట్ల లాభాలతో ఉండగా ఉత్తర డిస్కంలు 2,440 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. టీఆఎస్‌ ఆర్టీసీ 2,329 కోట్లు, గృహ నిర్మాణ సంస్థ 733 కోట్లు, హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ 96 కోట్లు, రాజీవ్‌ స్వగృహ సంస్థ రూ.66 కోట్ల నష్టాలను చవి చూసిందని నివేదికలో కాగ్‌ పేర్కొంది.

తరచూ నష్టాలు వస్తున్న ఆర్థిక సంస్థల పని తీరును సమీక్షించాలని కాగ్‌ ప్రభుత్వానికి సూచించింది. ఆయా సంస్థల ఆర్థిక పని తీరును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. 2020-21 సంవత్సరంలో ఒక్క సింగరేణి సంస్థ మాత్రమే పరిశోధన, ఆర్థిక కార్యక్రమాలను చేపట్టిందని కాగ్‌ ప్రశంసించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వరంగ సంస్థలకు నిధులను కేటాయించి ప్రోత్సహించాలని ఆ సంస్థలు లాభాల బాట పట్టేందుకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, తలహాలు ఇవ్వాలని కాగ్‌ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement