Friday, November 22, 2024

కార్మిక సంక్షేమ పథకాలకు మంగళం.. ఎస్‌ఆర్‌బీఎస్‌ను రద్దు చేయాలని ఆర్టీసీ నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆర్టీసీని మూసివేయం, కార్మికులను కన్న బిడ్డల్లా కాపాడుకుంటాం అంటూ తరచూ వల్లెవేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేసేందుకు సమాయాత్తమవుతోంది. ఇప్పటికే సంస్థలో కార్మిక సంఘాలకు ఉనికి లేకుండా చేసిన యాజమాన్యం ఆ తర్వాత సీసీఎస్‌ను నిర్వీర్యం చేసింది. తాజాగా కార్మికుల చివరి దశలో ఆర్థికంగా కొంత చేదోడు వాదోడుగా నిలుస్తున్న స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీం (ఎస్‌ఆర్‌బీఎస్‌) ను రద్దు చేయాలని నిర్ణయించింది. కార్మికుల నెలవారి వేతనాల నుంచి రూ. 250 లను కట్‌ చేసి ఎస్‌ఆర్‌బీఎస్‌ ట్రస్ట్‌ ఖాతాలో జమ చేస్తారు. ఇలా ప్రతి నెలా కోటి రూపాయల వరకు ఈ ఖాతాలో జమ అవుతుంటాయి. ఇలా జమ అయిన మొత్తాలను కార్మికులకు అత్యవసర ఆర్థిక సహాయం అవసరమైనపుడు నామమాత్రపు వడ్డీకి ఇచ్చి తిరిగి నెలసరి వాయిదాలుగా జమ చేస్తుంటారు. ఈ ట్రస్ట్‌కు కార్మికుల నుంచి వచ్చే మొత్తాలతో పాటు సంస్థ కూడా ఏటా రూ. 3.50 కోట్లు జమ చేస్తోంది. అంటే కార్మికుల వాటా కింద ఏటా రూ. 12 కోట్లు ట్రస్ట్‌కు వెళ్తుండగా, సంస్థ తన వాటాగా ఏటా రూ. 3.50 కోట్లను చెల్లించాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు పెన్షన్‌ చెల్లింపు పథకం లేకపోవడంతో 1989 సంవత్సరంలో అప్పటి ఆర్టీసీ కార్మిక సంఘంలోని ఎన్‌ఎంయూ నేత రామ్మోహన్‌రావు ఈ పథకాన్ని రూపొందించి సంస్థను ఒప్పించి అమలులోకి తీసుకు వచ్చారు. ఈ పథకం ద్వారా ఇప్పటికి ఒక్క టీఎస్‌ఆర్‌టీసీలోనే దాదాపు 35 వేల ఆర్టీసీ రిటైర్‌ ఉద్యోగులు నెలవారిగా పెన్షన్‌ను పొందుతున్నారు. రిటైరైన ఉద్యోగి మరణిస్తే ఆయన సతీమణి బతికి ఉన్నంత కాలం పెన్షన్‌ను పొందే అవకాశం ఈ పథకంలో కల్పించారు. సంస్థలో పని చేసిన ఒక్కో కార్మికుడి వేతనానికి అనుగుణంగా పెన్షన్‌ను చెల్లింపులు జరుపుతున్నారు. తాజాగా సంస్థ ఎండీ ఈ పథకాన్ని రద్దు చేయాలని నిర్ణయించి అంతర్గతంగా సర్క్యూలర్‌ను జారీ చేశారు. వాస్తవానికి మార్చి మాసం నుంచే ఈ పథకం నిలిపి వేయాలని నిర్ణయించినప్పటికీ సర్క్యూలర్‌ జారీ అయ్యేలోగానే ఉద్యోగుల పే స్లిప్‌లన్నీ ప్రింట్‌ పూర్తవడంతో మే మాసం చెల్లింపులలో ఎస్‌ఆర్‌బీఎస్‌ కటింగ్‌ లేకుండా వేతనం చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులు వేతన సవరణ లేక, డీఏ చెల్లింపులు లేకున్నా కష్టపడి పని చేస్తున్నారు. వారి కష్టార్జితంతో జీవితాంతం కూడబెట్టుకుని జీవిత చరమాంకంలో ఉపయోగపడేందుకు వీలుగా కొంత మొత్తాన్ని పోగు చేసుకుని వాటి ద్వారా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తుంటే యాజమాన్యం దాన్ని కూడా రద్దు చేయాలని నిర్ణయించడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రూ. 400 కోట్ల స్వాహాకు పక్కా ప్లాన్‌
ఎస్‌ఆర్‌బీఎస్‌ ట్రస్ట్‌ నుంచి సంస్థ నిర్వహణ కోసం ఆర్టీసీ యాజమాన్యం దాదాపు రూ. 400 కోట్లను వాడుకుంది. ఇటీవల కార్మిక సంఘం నేతగా పని చేసిన ఎన్‌ఎంయూకు చెందిన నేత నాగేశ్వరరావు సమాచార చట్టం కింద ఈ విషయాన్ని రాబట్టారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ట్రస్ట్‌కు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో సంస్థ ఎలాంటి బకాయిలను చెల్లించలేని స్థితిలో ఉన్నందున రూ. 400 కోట్లను స్వాహా చేసేందుకు యాజమాన్యం ఏకంగా ట్రస్ట్‌ను రద్దు చేయాలని నిర్ణయించిందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సీసీఎస్‌కు రూ. 650 కోట్లను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, పీఎఫ్‌ ట్రస్ట్‌ నుంచి రూ. 1300 కోట్లను వాడుకున్న యాజమాన్యం ఇప్పుడు కార్మికులకు చెందిన మరో రూ. 400 కోట్లను కూడా ఇవ్వకుండా ఎస్‌ఆర్‌బీఎస్‌ ట్రస్ట్‌ను రద్దు చేయాలనుకోవడం దుర్మార్గమని ఆర్టీసీ టీజేఎంయు నేత హన్మంతు మండిపడ్డారు.

ఉద్యమానికి సన్నద్దమవుతున్న కార్మిక సంఘాలు
ఎస్‌ఆర్‌బీఎస్‌ను రద్దు చేయాలన్న యాజమాన్యం నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యమం చేపట్టాలని కార్మిక సంఘాలన్నీ నిర్ణయించాయి. ఇప్పటికే డీఏల చెల్లింపు, వేతన సవరణతో పాటు అనేక అంశాలపై ఉద్యమాలను నిర్వహిస్తున్న కార్మిక సంఘాలు కార్మికుల అవసాన దశలో పనికి వచ్చేందుకు ఎన్నో ఏళ్ళుగా అమలవుతున్న పథకం ఎస్‌ఆర్‌బీఎస్‌ను రద్దు చేయాలని నిర్ణయించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏడాదికి రూ. 3.50 కోట్లను చెల్లించేందుకు ఇష్టపడని యాజమాన్యం పూర్తిగా ట్రస్ట్‌ను రద్దు చేయాలనుకోవడం బాధాకరమంటున్నారు. విద్యుత్‌ సంస్థలో అటెండర్‌గా పని చేసే ఉద్యోగికి బేసిక్‌ పే స్కేల్‌ 23880 కాగా, ఆర్టీసీలో ఉద్యోగికి రూ. 10,250లుగా ఉందని పేర్కొంటున్నారు. చెల్లించే వేతనం తక్కువ అయినప్పటికీ నిబద్దతతో పని చేస్తూ సంస్థ ఉన్నతికి పాటుపడుతున్నామని, అయినప్పటికీ యాజమాన్యం ఎప్పటికప్పుడు వివక్షను ప్రదర్శించడం దారుణమని కార్మికులు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement