Friday, November 22, 2024

Hyderabad | ఎయిర్​పోర్టు సిబ్బంది దాష్టీకం.. ఓలా డ్రైవర్​పై పిడిగుద్దులు, క్యాబ్​లను ఆపేసిన డ్రైవర్లు!

హైదరాబాద్​లోని రాజీవ్​ గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజులుగా ఎయిర్​పోర్టుకు ప్రయాణికులను తీసుకెళ్లి, తీసుకొచ్చే ఓలా, ఉబర్​ సర్వీసులు నిలిచిపోయాయి. దీనికి ప్రధానంగా రెండ్రోజుల్లో ఇద్దరు డ్రైవర్లపై జరిగిన దాడులే కారణంగా తెలుస్తోంది. క్యాబ్​ డ్రైవర్లకు రక్షణ కరువయ్యిందని, రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని డ్రైవర్స్​ అసోసియేషన్​ పోలీసులక ఫిర్యాదు చేసింది. అయినా.. ఈ సమస్యను పరిష్కరించకుండా పోలీసులు పట్టించుకోవడం లేదని క్యాబ్​ సర్వీసులను నిలిపేసి డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో రెండు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు డ్రైవర్లపై దాడులు జరిగాయి. విమానాశ్రయం ఆవరణలో జరిగిన ఈ ఘటనలపై ఆదివారం నుంచి పలు క్యాబ్ సేవలు నిలిచిపోయాయి. అయితే.. కొంతమంది డ్రైవర్లు నిరసన నిలిపేశారు. దీంతో కొన్ని క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. కాగా, మే 6వ తేదీ (శనివారం సాయంత్రం) జరిగిన ఒక ఘటనలో OLA డ్రైవర్ రవిని తీవ్రంగా కొట్టారు. అతని ముఖం మీద రక్తపు గాయాలయ్యాయి. భద్రతా సిబ్బంది శారీరక వేధింపుల కారణంగా అతని చెంపపై రక్తం గడ్డకట్టుకుపోయింది. రవి తెలిపిన వివరాల ప్రకారం.. అతను బుకింగ్ ఉన్నందున ఒక ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి తన వంతు కోసం వేచి ఉన్నాడు.

అయితే.. ఎయిర్​పోర్టు సిబ్బంది అతడిని వేచి ఉండేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ప్రయాణికుడిని మరో క్యాబ్‌లోకి మార్చినట్లు సమాచారం. ఈ క్రమంలో డ్రైవర్‌కు, సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. డ్రైవర్‌ను అక్కడి సిబ్బంది కొట్టారు. దీంతో ఓలా, ఉబర్ యాప్‌లతో సర్వీసులు అందించే 200 మంది క్యాబ్ డ్రైవర్లు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లి న్యాయం కోరుతూ ఆందోళనకు దిగారు. అక్కడికి ప్రయాణికులను అనుమతివ్వకుండా బ్లాక్ చేయడంతో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున ప్రయాణికులు ఎయిర్​పోర్టులోనే చిక్కుకుపోయారు.

- Advertisement -

ఈ ఆందోళనతో.. Ola, Uber డ్రైవర్లు RGIA లోపలికి.. వెలుపలికి వెళ్లే రహదారిని అడ్డుకోవడంతో పలువురు ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు పోలీసులు విమానాశ్రయానికి చేరుకుని ఆందోళన చేస్తున్న క్యాబ్ డ్రైవర్లను చెదరగొట్టారు. అయితే.. తమకు న్యాయం చేయాలని పోలీసులను సంప్రదించగా.. ముఖ్యమంత్రి కార్యక్రమంలో బిజీగా ఉండడంతో ఆ తర్వాత పరిష్కరిస్తామని పోలీసులు చెప్పారని బాధితుడు రవి పేర్కొన్నారు.

ఇక.. ఆదివారం సాయంత్రం పార్కింగ్ ఏరియాలో జరిగిన రెండో ఘటనలో రామ్ నాయక్ అనే డ్రైవర్‌ను ఎయిర్‌పోర్టు ఆవరణలో ఓ ప్రయాణికుడు చితకబాదారు. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. అతను స్మార్ట్​ ఫోన్​ నావిగేషన్‌లో చూపిన మార్గాన్ని అనుసరించాలని చూశాడు. అయితే.. ప్రయాణికుడు మాత్రం తనను ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా క్యాబ్‌ను తీసుకెళ్లాలని కోరాడు. దీంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో డ్రైవర్​పై దాడికి దిగడంతో తోటి డ్రైవర్లు కోపంగా ఉన్న ప్రయాణికుడి నుండి రక్షించారు. ఆ తర్వాత ప్యాసెంజర్​ ఫిర్యాదుతో అతని IDని OLA అధికారులు బ్లాక్ చేశారు.

అయితే.. ఇప్పటికి తాను ఏడేళ్లుగా ఓలా యాప్‌తో పనిచేస్తున్నానని రామ్ తెలిపాడు. తనపై ఏదైనా తీవ్రమైన చర్యలు తీసుకునే ముందు కనీసం ఈ విషయాన్ని విచారణ జరపాలని OLA అధికారులను కోరాడు. తన IDని బ్లాక్ చేసే ముందు OLA అధికారులు CCTV ఫుటేజీని కూడా తనిఖీ చేయలేదని, ప్యాసెంజర్​ తనను తిట్టి, కొట్టిన విషయాన్ని పట్టించుకోకుండా తనపై చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇక.. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యుయు) ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. ఓలా, ఉబర్​ సర్వీసులతో క్యాబ్​ డ్రైవర్ల  చాలా ఇబ్బందులు పడుతున్నారు. హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. సమస్యను పరిష్కరించడానికి, విమానాశ్రయంలో డ్రైవర్‌లకు మెరుగైన వైద్యం అందించడానికి జీఎంఆర్ యూనియన్.. ఓలా, ఉబెర్ అగ్రిగేటర్ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సలావుద్దీన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎయిర్‌పోర్టుకు అక్రమంగా వచ్చే వాహనాలను ఆపేయాలని, వారు పేద డ్రైవర్ల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పారు. ఈ విషయాలన్నిటిమీద టీజీపీడబ్ల్యూయూ సభ్యులు సోమవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement