ఫార్చూనర్ కారుని బస్సు ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు..30మందికి పైగా గాయపడ్డారు.గుజరాత్‌లో నవ్‌సారి జిల్లా వెస్మా సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో 17 మందిని వల్సాద్‌లోని ఆసుపత్రికి.. 14 మందిని నవ్‌సారిలోని ఆసుపత్రికి మరొక క్షతగాత్రుడిని చికిత్స కోసం సూరత్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ధాటికి కారు ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడం వల్ల అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫార్చూనర్ కారులో ఉన్నవారు సూరత్ లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణం అయ్యారు. అలాగే బస్సు నవ్ సారి నుంచి వల్సాద్ వెళ్తోంది. మృతులంతా గుజరాత్ లోని అంకాలేశ్వర్‌వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక యంత్రాంగం క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందిస్తోందని.. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.