న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సామాన్యుడిపై పెనుభారం మోపుతూ పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఓపిక నశించిందంటూ ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్యాస్ ధరలు పెంచి మహిళా దినోత్సవం సందర్భంగా ఆడవాళ్లకు గొప్ప కానుక ఇచ్చారని ఎంపీ నామా ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల సామాన్యులు కుదేలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజలు మళ్ళీ కట్టెల పొయ్యిలు వాడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు.
బడా కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు దేశాన్ని దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుకుంటూ పేద, మధ్యతరగతి వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాకంఠక బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రజలు ఓటుతో తగిన గుణపాఠం నేర్పాలని నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పెంచిన గ్యాస్ ధరలను ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే వెంటనే తగ్గించాలని సూచించారు. మహిళలంతా ఐక్యమై మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప వారి బతుకులు మారవని ప్రకటనలో పేర్కొన్నారు. ఓవైపు ఉజ్వల పథకం పేరుతో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మరో వైపు ధరలు పెంచడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ధరలు దిగొచ్చేంత వరకు పోరాటం చేయాలని ఆయన అన్నారు.