– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 3 నెలలుగా పలు కేసులకు సంబంధించి దాడులు, సోదాల్లో దాదాపు రూ.100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఆ మధ్య మొబైల్ గేమింగ్ అప్లికేషన్‌కు సంబంధించిన మోసం కేసులో కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త ఇంట్లో రూ.17 కోట్లకు పైగా స్వాధీనం చేసుకుంది. ఇక.. తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పోలీసుల చెకింగ్‌లో కోట్లాది రూపాయల నగదు పట్టుబడుతోంది.
బెంగాల్లో దొరికిన డబ్బును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును లెక్కించేందుకు కరెన్సీ లెక్కింపు యంత్రంతో పాటు దాదాపు 8మంది బ్యాంకు అధికారులను పిలిపించారు. పశ్చిమ బెంగాల్ SSC స్కామ్‌కు సంబంధించి సస్పెండ్ చేసిన మంత్రి పార్థ చటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ అపార్ట్ మెంట్ల నుండి 50 కోట్ల కంటే ఎక్కువే స్వాధీనం చేసుకుంది.
పార్థ చటర్జీ గ్రూప్ C & D సిబ్బంది, IX-XII తరగతుల అసిస్టెంట్ టీచర్లు, ప్రైమరీ టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రికవరీ చేసిన ఈ మొత్తం టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ నుండి వచ్చిన డబ్బేనని అనుమానిస్తున్నారు. దాదాపు 24 గంటల పాటు సాగిన కౌంటింగ్‌లో పట్టుబడిన నగదును లెక్కించి బ్యాంకు అధికారులు సైతం విసిగిపోయారు. దీనికి ముందు జార్ఖండ్ మైనింగ్ స్కాంలో రూ.20 కోట్లకుపైగా నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైన పేర్కొన్న సీజ్‌కి అదనంగా, ఏజెన్సీ వివిధ దాడులు, పరిశోధనలలో కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది.
రికవరీ చేసిన నగదును ఈడీ ఏం చేస్తుంది?
ఆర్థిక దర్యాప్తు సంస్థ డబ్బును స్వాధీనం చేసుకునే అనుమతి ఉంటుంది. అయితే, వారు ఆ నగదును తమ వద్ద ఉంచుకునే అవకాశం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ఏజెన్సీ నగదును రికవరీ చేసినప్పుడల్లా నిందితుడికి నగదు ఎక్కడ నుంచి వచ్చింది అనే వివరాలు తెలియజేయడానికి అవకాశం ఇస్తుంది. అనుమానితుడు ఈడీ అధికారులను కానీ, సీబీఐని కానీ సరైన వివరాలు, కచ్చితమైన సమాధానాలు, ఆధారాలు చూపకపోతే ఆ డబ్బుని లెక్కల్లోకి రాని నగదుగా.. అక్రమంగా సంపాదించిన డబ్బుగా పరిగణిస్తారు.
ఇట్లా స్వాధీనం చేసుకున్న నగుదును ఓ మెమోలో 2000, 500, 100 వంటి డినామినేషన్లలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలు తెలియపరుస్తారు. తర్వాత స్వతంత్ర సాక్షుల సమక్షంలో వాటిని బాక్సుల్లో పెట్టి సీలు వేస్తారు. డబ్బు సీలు చేసిన తర్వాత ఆ సీజ్ చేసిన డబ్బుకు సంబంధించిన మెమోను, రికవరీ చేసిన నగదును ఆ రాష్ట్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు పంపిస్తారు. అక్కడ అది ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌కి చెందిన వ్యక్తిగత డిపాజిట్ (PD) ఖాతాలో జమ అవుతుంది. దీని ప్రకారం నగదు కేంద్ర ప్రభుత్వ ఖజానాలో జమ అవుతున్నట్టు లెక్క.
అయితే, స్వాధీనం చేసుకున్న డబ్బును ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, బ్యాంకు లేదా ప్రభుత్వం ఏవీ ఉపయోగించడానికి అవకాశం లేదు. ఏజెన్సీ సీజ్ చేసిన నగదుకు సంబంధించిన తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్‌ను సిద్ధం చేస్తుంది. ఆరు నెలల్లో ఈ అటాచ్‌మెంట్‌ను నిర్ధారించడానికి న్యాయనిర్ణేత అధికారం అవసరం. ఈ కసరత్తు యొక్క ఉద్దేశం ఏమిటంటే.. నిందితులు స్వాధీనం చేసుకున్న నగదును ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతారు. అటాచ్మెంట్ నిర్ధారించబడిన తర్వాత కేసులో విచారణ ముగిసే వరకు డబ్బు బ్యాంకులోనే ఉంచుతారు. నిందితుడు దోషిగా తేలితే ఆ నగదు మొత్తం కేంద్రానికి చెందిన ఆస్తి అవుతుంది. నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తే బ్యాంకులో సేఫ్‌గా ఉన్న ఆ నగదు తిరిగి అందజేస్తుంది.