Saturday, November 23, 2024

బేయిలివ్వొద్దు.. బుల్లిబాయి కేసులో నిందితులే, సుల్లీ డీల్స్ నిర్వాహకులు..

‘బుల్లి బాయి’ యాప్ కేసులో అరెస్టయిన ముగ్గురి బెయిల్ పిటిషన్‌లను ముంబై పోలీసుల సైబర్ సెల్ వ్యతిరేకించింది. దర్యాప్తులో నిందితులకు ‘సుల్లి డీల్స్’ యాప్ కేసులో కూడా ప్రమేయం ఉన్నట్లు పేర్కొంది. బుల్లి బాయి యాప్ కేసులో విశాల్ కుమార్ ఝా, శ్వేతా సింగ్, మయాంక్ రావత్‌ బెయిల్ పిటిషన్‌లను వ్యతిరేకిస్తూ ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన సైబర్ సెల్ ముంబైలోని సిటీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నిందితులు నేరం చేసినట్లు వెల్లడైందని, ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన బుల్లి బాయి యాప్ సృష్టికర్త నీరాజ్ బిష్ణోయ్ సహాయం చేసినట్టు పోలీసులు తెలిపారు.

ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్‌లను తిరస్కరించాలని కోర్టును ఆశ్రయించిన పోలీసులు “వారు పారిపోవచ్చు లేదా కేసులో సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు” అని వాదించారు. విచారణ సందర్భంగా, ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన బుల్లి బాయి యాప్ కేసులో అరెస్టయిన నీరాజ్ బిష్ణోయ్, సుల్లి డీల్స్ యాప్ కేసులో పట్టుబడిన ఓంకారేశ్వర్ ఠాకూర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తుల కస్టడీ కోసం ఢిల్లీకి ఒక బృందాన్ని పంపినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా పోస్ట్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఠాకూర్‌, బిష్ణోయ్‌ బెయిల్‌ దరఖాస్తులను ఢిల్లీ కోర్టు గతంలో తిరస్కరించిందని ముంబై కోర్టుకు తెలిపారు. బుల్లి బాయి కేసులో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీటెక్ విద్యార్థి నీరాజ్ బిష్ణోయ్ (20)ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ (IFSO) బృందం అస్సాంలో అరెస్టు చేసింది. బాంద్రా కోర్టు గతంలో బుల్లి బాయి యాప్ కేసులో సహ నిందితులు శ్వేతా సింగ్, మయాంక్ రావత్‌ ను జనవరి 28 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. దీనికి ముందు, వారిని జనవరి 14 వరకు ముంబై సైబర్ సెల్ పోలీసు కస్టడీకి పంపారు. వారిని ఉత్తరాఖండ్ లో అరెస్టు చేశారు. కాగా, ఇదే కేసులో విశాల్ కుమార్ ఝా జనవరి 24న జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement