పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభ సమావేశం కానుంది. ఈ సారి రెండు విడతలుగా పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11 వరకు తొలి విడత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు 2వ విడత సమావేశాలు జరుగుతాయి.
మంగళవారం(ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రెండో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చకు కేటాయించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి ఏడున ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ జరుగుతున్న ఈ సమావేశాల్లో పెగసస్ నిఘా వ్యవహారం, నిరుద్యోగం సహా పలు అంశాలలో కేంద్రం తీరును ఎండగట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.