హైదరాబాద్, ఆంధ్రప్రభ : శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఏడు రోజులపాటు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభలోని తన కార్యాలయంలో నిర్వహించిన శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి తరఫున ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, శాసనసభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలను ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక ఆదివారం మినహా అన్ని రోజుల్లోనూ సభలు నిర్వహించాలని ఎక్కువ గంటలపాటు సభలు జరిపి అన్ని అంశాలను చర్చించాలని ప్రతిపాదించారు.
ఈనెల 8, 13 తేదీల్లో శాసనసభకు సెలవులను ప్రకటించారు. సోమవారం ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మరుసటి రోజు ఉభయ సభలకు సెలవు ఇస్తారు. తిరిగి సభ బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశమవుతుందని స్పీకర్ పోచారం ప్రకటించారు. మరిన్ని ఎక్కువ రోజులు సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్, ఎంఐఎం శాసనసభా పక్ష నేతలు కోరినా ప్రభుత్వం మాత్రం ఏడు రోజులపాటు సభ నిర్వహణకు మొగ్గు చూపింది. బీఏసీ సమావేశానికి ముందు శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. బీఏసీ సమావేశానికి రావాలని ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కలిసి కోరారు.
వెల్‌లోకి వస్తే సస్పెండ్ చేస్తాం : హరీష్
అసెంబ్లీ సమావేశాల జరిగే సందర్భంలో సభ్యులెవరైనా స్పీకర్ పోడియం వైపు దూసుకువచ్చినా, వెల్‌లోకి వచ్చినా వారిపై సస్పన్షన్ వేటు వేస్తామని ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన హరీష్.. బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వచ్చారు కాబట్టే వారిపై సస్పెన్షన్ విధించామని చెప్పారు. తమ స్థానంలో నిలబడి అడిగితేనే పార్లమెంట్ సభ్యులను లోక్‌సభ స్పీకర్ సస్పెండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. ఢిల్లీకి ఒక న్యాయం.. రాష్ట్రానికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. సస్పెన్షన్ అవ్వాలనే కోరికతో బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకువచ్చారని పేర్కొన్నారు. గవర్నర్, బడ్జెట్ ప్రసంగాల సమయంలో విపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి రావడం సంప్రదాయం కాదని ఆయన హితవు పలికారు.