దేశంలో డిజిటల్ రూపాయి తీసుకువస్తామని కేంద్రం ప్రకటించింది. డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో ఆర్బీఐ ఇందుకోసం రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని ఆమె తెలిపారు. యానిమేషన్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం స్థానంలో నూతన చట్టం తీసుకొస్తామన్నారు. మానసిక చికిత్సకు ఆన్లైన్ టెలి మెడిసన్ విధానం అమలు చేస్తామన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2022-23 బడ్జెట్లో ద్రవ్యలోటు 6.9శాతమని, దాన్ని 2025-26 నాటికి 4.5శాతానికి తగ్గించడం లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు ఆర్థికసాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు.
ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే రిటర్న్లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు. అదే విధంగా కోటి కుటుంబాలకు ఉజ్వల పథకం విస్తరించనున్నట్లు ప్రకటించారు. సహకార సంఘాలపై సర్ ఛార్జీని తగ్గించనున్నారు.