నిర్భయ, హత్రాస్ రేప్ కేసుల్లో బాధితుల తరపున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా కుష్వాహ బీఎస్పీలో చేరారు. లక్నోలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా సమక్షంలో సీమా బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేందుకే పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీమా చేరిక బీస్పీకి మరింత బలాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశాన్ని కుదిపేసిన నిర్భయ, హత్రాస్ లాంటి కేసుల్లో బాధితుల తరపున కోర్టు ముందు వాదనలు వినిపించిన సీమా పార్టీలోకి చేరడం వల్ల మహిళల్లో మరింత ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
సీమా కుశ్వాహా, ఉత్తరప్రదేశ్‌లోని ఈటీవా జిల్లా బిదిపూర్ గ్రామంలో 1982 జనవరి 10న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రాంకున్రి కుశ్వాహా, బలదిన్ కుశ్వాహా. వీరికి ఆరుగురు ఆడపిల్లలు. అందులో సీమా నాలుగవ కుమారై . సీమా కుష్వాహా సుప్రీంకోర్టు న్యాయవాది. 2012లో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ కేసులో బాధితురాలు తరుపున వాదించి.. ఆ కేసును గెలిచి మంచి పేరు ప్రఖ్యాతను గడించింది. అలాగే.. హత్రాస్ రేప్ కేసు బాధితుల తరఫున సుప్రీంకోర్టులో వాదించారు. అలాగే నిర్భయ జ్యోతి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి.. అత్యాచార బాధితులకు న్యాయం జరిగేలా ప్రచారాన్ని చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..