తెలంగాణ ప్రభుత్వంపై బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితులను అణచివేయడంలో కేసీఆర్ ప్రభుత్వం అగ్రభాగాన ఉందని అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపల్లిలో ఇండస్ట్రీ పేరుతో దాదాపుగా దళితులు, గిరిజనుల 600 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం లాక్కొని కొందరు పారిశ్రామికవేత్తలకు దొంగచాటుగా కట్టబెడుతోందని ఆరోపించారు. ఈ అసైన్డ్ భూములేమైనా మీ తాతల జాగీరా ? అంటూ ప్రశ్నించారు. ఈ దారుణాలను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న ఈ కబ్జాల టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించి దోపిడీ లేని బహుజన రాజ్యాన్ని స్థాపిద్దామని పిలుపునిచ్చారు.
తొండలు కూడా గుడ్లు పెట్టని భూములను పేదలకు ఇచ్చి ఊరంతా చాటింపేసుకుంటున్నారని ప్రవీణ్ మండిపడ్డారు. ఆ భూములను నడ్డివిరిగేలా పనిచేసి చదును చేసుకున్నాక అసైన్డ్ ల్యాండ్ అని భూములు తిరిగి లాక్కొని కొందరు టీఆర్ఎస్ తొత్తులకు ఇస్తున్నారని ఆరోపించారు. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
నల్గొండ జిల్లాలో ఓ దళిత వ్యక్తిపై పోలీసులు దాడి చేసి కాలు విరగొట్టారంటూ ఓ యూట్యూబ్ చానల్‌లో వచ్చిన కథనాన్ని షేర్ చేసి ప్రవీణ్ స్పందించారు. దళితులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరియమ్మ, వీరశేఖర్, ఇప్పుడు రొయ్య శ్రీనివాస్.. దేశంలో ఇంతకన్నా దళిత వ్యతిరేక సర్కార్ ఏదైనా ఉంటుందా ? అని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.