Tuesday, November 26, 2024

ప్రభుత్వాన్ని నడిపే సత్తా యడ్డీకి లేదు: బీజేపీ నేత సంచలన వ్యాఖ్య

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై సొంత పార్టీలోనే అసమ్మతి స్వరం పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు. తాజగా బీజేపీ నేత, ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ కూడా యడ్డీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యడియూరప్ప నాయకత్వంపై తమకు గౌరవం ఉందని… అయితే, ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపే సత్తా మాత్రం ఆయనలో కొరవడిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత, సత్తా యడియూరప్పకు లేవని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే విషయాన్ని కర్ణాటక బీజేపీ ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్ కు తెలిపారు. కర్ణాటక బీజేపీలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో యడ్డీపై విశ్వనాథ్ ఎన్నో ఆరోపణలు చేశారు. యడ్డీ ప్రభుత్వంపై మంత్రులందరూ అసంతృప్తిగా ఉన్నారని ఆయన ఆరోపించారు. వంశపారంపర్య రాజకీయాలు ప్రమాదకరమని ప్రధాని మోదీ పదేపదే చెపుతుంటారని… అయితే కర్ణాటకలో ఇప్పుడు అదే రాజకీయం నడుస్తోందని ఆయన తెలిపారు. ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని తాను వెల్లడిస్తే… ప్రభుత్వం తన వ్యాఖ్యలను మరో విధంగా తీసుకుంటోందని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వ వ్యవహారాల్లో యడియూరప్ప కుటుంబ జోక్యం ఎక్కువైపోయిందని విశ్వనాథ్ చెప్పారు. ప్రతి డిపార్ట్ మెంట్ లో యడియూరప్ప కుమారుడు కలగజేసుకుంటున్నారని తెలిపారు.

కర్ణాటకలో కాంగ్రెస్- జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 18 మంది ఎమ్మెల్యేల్లో విశ్వనాథ్ ఉన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పార్టీపై తిరుగుబాటు చేశారు. అనంతరం ఆయన బీజేపీలో ఫిరాయించి… 2019లో యడియూరప్ప సీఎం అయ్యేందుకు సహాయపడ్డారు. అయితే, ఉప ఎన్నికల్లో విశ్వనాథ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

మరోవైపు బీజేపీ అధిష్టానం కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చబోతోందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది బిజెపి ఎమ్మెల్యేలు బహిరంగంగానే యడియూరప్పపై విమర్శలకు దిగుతున్నారు. ఇటీవల యడియూరప్పను ప్రశంసిస్తూ.. అరుణ్‌సింగ్‌ ఫోన్‌ చేసినట్లు సమాచారం. కరోనా సంక్షోభాన్ని అరికట్టడంలో సీఎం చేసిన కృషి ప్రశంసనీయమని అరుణ్‌సింగ్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే సీఎంగా యడియూరప్ప తన పదవీకాలాన్ని పూర్తి చేస్తారని హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, లింగాయత్‌ నేత కర్ణాటకలో మొదటిసారిగా ముఖ్యమంత్రిగా పూర్తికాలం కొనసాగడం పార్టీకి లాభం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement