మెడికల్ విద్యార్థినిపై అఘాయిత్యం
అమానుషంగా చంపేసిన దుండగులు
కళ్లు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్
గ్యాంగ్ రేప్ జరిగిందని పోస్టుమార్టమ్ రిపోర్ట్
ఆనవాళ్లు దొరక్కుండా ఘటనా స్థలం ధ్వంసం
అయినా.. పట్టించుకోని బెంగాల్ సర్కారు
హైకోర్టుకెళ్లిన మృతురాలి తల్లిదండ్రులు
సీబీఐ విచారణకు ఆదేశించిన న్యాయస్థానం
దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
ఓపీ, వైద్య సేవలను బహిష్కరించిన ఐఎంఏ
ఏపీ, తెలంగాణలో డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళన
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్: కోల్‌కతాలో ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్జీ కార్ వైద్యశాలలో ఛాతీ వైద్య విభాగంలో పీజీ సెకండియర్ విద్యార్థిని ఆగస్టు 8న రాత్రి సమయంలో డ్యూటీలో ఉండగానే దారుణ హత్యకు గురైంది. సెమినార్ హాల్లో అర్ధనగ్నంగా పడి ఉన్న ఆమె దేహంపై గాయాల గుర్తులున్నాయి. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ గేమ్‌ను వీక్షించినట్లు తోటి సిబ్బంది వెల్లడించారు. హత్య జరిగిన రోజు రాత్రి విధుల్లోకి వచ్చిన ఆమె.. తోటి సిబ్బందితో కలిసి ఒలింపిక్స్ పోటీలను వీక్షించారు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్‌ను ఆస్వాదించారు. అదే సమయంలో తన సహచరులతో కలిసి డిన్నర్ కూడా చేశారు. డిన్నర్ ఫినిష్ చేసి తన తల్లికి ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సహోద్యోగులు విధుల్లోకి వెళ్లిపోయారు. బాధితురాలు మాత్రం చదువుకునేందుకు సెమినార్ హాల్‌కి వెళ్లిపోయినట్లు తోటి సిబ్బంది తెలిపారు.
దారుణం జరిగిపోయిందన్న తండ్రి..
మృతదేహం చూసిన బాధితురాలి తండ్రి, తన కుమార్తెపై లైంగిక దాడి చేసి హత్య చేశారని, ఎవరో దారుణానికి ఒడిగట్టారని రోదించారు. పోలీసులు రంగంలోకి దిగి అనుమానాస్పద స్థితిలో ఆమె మృతి చెందిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు హాస్పిటల్‌తో ఎలాంటి సంబంధం లేని బయటి వ్యక్తి అని, ఘటన జరిగిన రోజు దవాఖానలోని అన్ని విభాగాల్లో స్వేచ్ఛగా తిరిగాడని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల పోలీస్ రిమాండ్‌కు ఆదేశించింది.
పోస్టుమార్టంలో వెలుగు చూసిన అమానుషం..
కోల్‌కతా మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ పోస్టుమార్టంలో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి కళ్లు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం అయినట్లు డాక్టర్లు తమ నివేదికలో వెల్లడించారు. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు పోస్టుమార్టమ్ నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు డాక్టర్లను కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
తమ కుమార్తెపై సామూహిక లైంగిక దాడి జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. గొంతు పిసికి చంపడం వల్లనే తమ కుమార్తె మరణించినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించిందని తెలిపారు. తమ కుమార్తె సామూహిక లైంగిక దాడి చేసి, హత్యకు గురైనట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఇతర నిందితులను అరెస్టు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాలేజీ ప్రిన్సిపాల్, ఇతర వ్యక్తులను ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
సీబీఐ దర్యాప్తు ప్రారంభం
కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. దర్యాప్తు బాధ్యతను స్వీకరించిన వెంటనే సీబీఐ ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్ బృందాన్ని ఘటనా ప్రాంతానికి పంపింది. ఈ కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర పోలీసులు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఇంతటి హేయమైన నేరానికి పాల్పడిన నిందితుడిని ఉరితీయాలని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణలో నిరసనలు
కోల్‌కతాలో జరిగిన ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరననలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్థిని దారుణ మరణాన్ని నిరసిస్తూ.. మెడికల్ విద్యార్థులు ఈ నెల 14వ తేదీ నుంచి ఓపీ బహిష్కరించారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లలో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. అందులోనూ ఇక్కడి డాక్టర్లు పాల్గొంటున్నారు. 17వ తేదీ నుంచి 24 గంటల పాటూ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ వెల్లడించింది. అయితే.. అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది.
పశ్చిమబెంగాల్‌కు సవాల్‌గా మారిన సంఘటన
వైద్య విద్యార్థిని ఘటన బెంగాల్ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశించింది. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే బుధవారం రాత్రి హాస్పిటల్‌ను దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై కూడా హైకోర్టు సీరియస్‌గా అయ్యింది. సెక్షన్ 144 అమలులో ఉన్నప్పుడు ఇలాంటి ఘటన జరగడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లే అని.. మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అక్కడ ఉద్యోగులు, వైద్యులకు రక్షణ కల్పించాలని హైకోర్టు సూచించింది.