Friday, November 22, 2024

నాటు బాంబుల‌తో పుదుచ్చేరి బిజెపి నేత దారుణ‌హ‌త్య‌

పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ నేత హత్య సంచలనం రేపుతోంది.. మంగళం నియోజకవర్గ బీజేపీ కార్యదర్శిగా ఉన్న సెంథిల్‌కుమార్.. గత రాత్రి ఓ బేకరీ దగ్గర ఉండగా.. మూడు బైక్‌లపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు.. ముందుగా నాటు బాంబులతో దాడి చేసి.. ఆ తర్వాత కత్తులతో ఎటాక్‌ చేసి నరికి చంపారు.. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. బైక్‌లపై రావడం.. బాంబులు విసరడం.. కత్తులతో నరకడం.. ఇలాంటి దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యాయి.. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే సెంథిల్‌కుమార్‌ను ప్రత్యర్థులు హత్య చేశారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.. ఇక, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. స్థానిక సీఐ, ఎస్‌ఐని సస్పెండ్‌ చేసింది..

సెంథిల్‌కుమార్ (వయస్సు 46). భాజపాకు చెందిన ఆయన మంగళం నియోజకవర్గ ఇంచార్జిగా కూడా ఉన్నారు.. పుదుచ్చేరి హోం మంత్రికి మద్దతుదారుగా ఉన్నారు.. మంగళం నియోజకవర్గం అరియూరులో గత రాత్రి జరిగిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. అనంతరం విలియనూర్ కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని ఓ ప్రైవేట్ బేకరీ దుకాణంలో టీ తాగుతున్నారు. అప్పుడు 3 ద్విచక్రవాహనాలపై ముసుగులు ధరించిన 9 మంది ముఠా అక్కడికి వచ్చింది. అనంతరం అకస్మాత్తుగా సెంథిల్‌కుమార్‌పై నాటు బాంబును విసిరారు. సెంథిల్‌కుమార్‌ సమీపంలో బాంబు పడి పేలింది. దీంతో షాక్‌కు గురైన సెంథిల్‌కుమార్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ ముఠా మరో నాటు బాంబును విసిరింది. బాంబు అతనిపై పడి పెద్ద శబ్ధంతో పేలింది. బాంబు పేలుడు ధాటికి కిందపడిపోవడంతో ఆయన్ని చుట్టుముట్టి కొడవళ్లతో నరికి చంపారు. ఈ దాడిలో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి మృతిచెందాడని ధృవీకరించుకున్న తర్వాత ఆ ముఠా మెరుపు వేగంతో మోటార్‌సైకిళ్లపై అక్కడి నుంచి పారిపోయింది.

ఇక, హత్య సమాచారం అందుకున్న లా అండ్ ఆర్డర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య, పోలీస్ సూపరింటెండెంట్ రవికుమార్, విలియనూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వేలయ్యన్, సబ్ ఇన్‌స్పెక్టర్ వేలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సెంథిల్‌కుమార్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కతిర్ గ్రామం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మంత్రి నమచివాయం కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. హంతకులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. శత్రుత్వం కారణంగా హత్య చేశారా? లేక మరేదైనా కారణమా? అనేదానిపై ఆరా తీస్తున్నారు.. బేకరీ షాపులో అమర్చిన నిఘా కెమెరాలో నమోదైన దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన కొద్దిసేపటికే సెంథిల్‌కుమార్‌ మద్దతుదారులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement