Friday, November 22, 2024

క‌న్న‌డ నాట బోణికి వ్యూహాత్మ‌క ఎత్తు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: కర్ణాటకలో మరో నాలుగు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ -చేసేందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌తో వ్యూహాత్మక పొత్తు పెట్టుకునేందుకు భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాలోచనలు జరుపుతున్నట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్‌తో కలిసి పనిచేయాలన్న నిర్ణయాన్ని కేసీఆర్‌ త్వరలో ప్రకటించనున్నారని భారాస వర్గాలు చెబుతున్నాయి. మార్చి నెల చివరిలో లేదా ఏప్రిల్‌ నెల మొదట్లో ఇందుకు సంబంధించి ఇరు పార్టీల అధ్యక్షులు సమావేశమై ఉమ్మడి ప్రకటన చేయనున్నట్టు- చెబుతున్నారు. జనతాదళ్‌ పార్టీ గుర్తుపై కాకుండా భారాస గుర్తుతోనే నామినేషన్‌ వేసి ఎన్నికల రణరంగంలో దిగాలన్న ప్రతిపాదనకు కుమారస్వామి కూడా అంగీకారం తెలిపినట్టు- చెబుతున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలను నిలువరించాలంటే భారాస లాంటి బలమైన రాజకీయ శక్తి ఎంతో అవసరమన్న భావనతో జేడీఎస్‌ అధినేత కుమారస్వామి ఉన్నట్టు- చెబుతున్నారు.


కర్ణాటకలో పోటీ-పై చర్చోపచర్చలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారాస అభ్యర్థులను బరిలోకి దింపే అంశంపై గత వారం రోజులుగా కుమారస్వామితో కేసీఆర్‌ వరుస -టె-లీఫోన్‌ మంతనాలు జరుపుతున్నట్టు- తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు కర్ణాటకలో జరిగే సాధారణ ఎన్నికల్లో భారాస పక్షాన అభ్యర్థులను నిలబెట్టి గెలుపొంది సత్తా చాటాలని తద్వారా ఈ అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసేలా చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు- సమాచారం. తెలుగు మాట్లాడేవారున్న ప్రాంతాలను, నియోజకవర్గాలలో పర్యటించి వచ్చిన భారాస అగ్రనేతలు అక్కడి పరిస్థితులపై అధినేత కేసీఆర్‌కు నివేదిక అందజేశారు. ఈ నివేదికను అధ్యయనం చేసిన కేసీఆర్‌ నియోజక వర్గాల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించినట్టు- చెబుతున్నారు. నిజాం కాలంలో హైదరాబాద్‌ రాష్ట్రం పరిధిలో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలుండేవి. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని కళ్యాణ కర్ణాటక(కెకె)గా పిలుస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న దాదాపు 30లోపు నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలన్న అంచనాకు వచ్చినట్టు- చెబుతున్నారు. కుమారస్వామితో అంతిమంగా మాట్లాడి నియోజక వర్గాల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది.
ఏఏ నియోజక వర్గాల్లో జనతాదళ్‌ (సెక్యులర్‌) పూర్తి మద్దతు ఇస్తుందో ఒక అవగాహనకు వచ్చి ఆ నియోజక వర్గాల్లో జేడీఎస్‌ నుంచి పూర్తి మద్దతు పొందాలని, ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా చూసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు- సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలను దెబ్బతీసేందుకు వ్యూహాత్మక పొత్తు, సీట్ల సర్దుబాటుకు రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న అభిప్రాయాన్ని కేసీఆర్‌ చర్చల సందర్భంగా కుమారస్వామితో అన్నట్టు- సమాచారం. ఆయన కూడా ఈ ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేసినట్టు- భారాస వర్గాలు చెబుతున్నాయి.

త్వరలో కర్ణాటకు కేసీఆర్‌
తెలంగాణకు పొరుగున ఉన్న కర్ణాటక జిల్లాలు బీదర్‌, రాయచూర్‌, గుల్భర్గా, యాద్గిర్‌, కలబురగి, సింధనూర్‌, కొప్పల్‌తో పాటు- తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా గల ప్రాంతాలు బళ్లారి, విజయనగరలలో పర్యటించి అక్కడి వారితో కలిని మాట్లాడేందుకు కేసీఆర్‌ సిద్ధమైనట్టు- తెలుస్తోంది. ఈ విషయాన్ని కుమారస్వామితో కూడా పంచుకోగా తమ పార్టీ ముఖ్యులను కూడా ఆయా జిల్లాల్లో పర్యటించేలా చర్యలు తీసుకుంటానని చెప్పినట్టు- సమాచారం.
కాగా తెలంగాణ పొరుగున ఉన్న 20 నుంచి 25 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ- చేసేందుకు కేసీఆర్‌ సిద్ధమైనట్టు- సమాచారం. బెంగళూర్‌ మహా నగరంలో రెండు, మూడు నియోజక వర్గాల్లో భారాస అభ్యర్థులను పోటీ-కి దింపే అంశంపై సమాలోచనలు జరుగుతున్నట్టు- పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కళ్యాణ కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌, భాజపాకు చెందిన ఇరవై మంది కీలక నేతలు భారాస చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరంతా ఆయా జిల్లాలు నియోజక వర్గాల్లో బలమైన నేతలని, కర్ణాటకలో కేసీఆర్‌ పర్యటన సమయంలో వీరంతా గులాబీ పార్టీలో చేరతారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూర్‌, కర్నూల్‌, అనంతపురం జిల్లా సరిహద్దు నియోజక వర్గాల్లోనూ సత్తా చాటేవిధంగా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలని, ఈ జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్‌, తెదేపా, వైకాపాల్లో ఉన్న అసంతృప్త నేతలకు గాలం వేసి వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సరిహద్దు నియోజక వర్గాల తెలుగు ప్రజలను చైతన్యం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు- ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement