Tuesday, November 26, 2024

గులాబీ బ‌ల‌గం – ఎన్నికలే ల‌క్ష్యం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి: బీఆర్‌ఎస్‌ ఇపుడు తెలంగాణ ఎన్నికలపై స్పష్టమైన లక్ష్యంతో రెడీ అయింది. పకడ్బందీ కార్యాచరణతో లెక్కలు సిద్ధం చేసుకుంది. పేరు మారినా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావమే అసలైన ఆవిర్భావంగా భావిస్తున్న బీఆర్‌ఎస్‌ ఉత్సవాలకే అదే తేదీ ఫిక్సయింది. ఏప్రిల్‌ 25న తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు సంబురాలకు డిసైడ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు నిర్వహంచి ప్రజలపై పార్టీ కేడర్‌పై గట్టి ఇంపాక్ట్‌ పడేవిధంగా అధిష్టానం ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అందజేశారు. మరోవైపు ఈనెల 27న సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు సర్వే నివేదికలు చెప్పనున్నారు. టికెట్లపై స్పష్టత ఇవ్వనున్నారు. వెనుకబడ్డ ఎమ్మెల్యేలకు పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు మూడుమాసాల గడువు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆవిర్భావ కార్యక్రమాల నేపథ్యంలో తమ తమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులు నియోజకవర్గంలో అత్యంత ఘనంగా నిర్వహంచేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఒకే రోజు సంబురాలు నిర్వహంచడమే కాకుండా ఈ ప్లీనరీలలో కేడర్‌కు బహుముఖ కర్తవ్యాలను అందించనున్నారు. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగనున్నందున, ఆ ఎన్నికలకు ముందస్తుగా కేడర్‌ను సంసిద్ధం చేసే సభలుగా వీటిని నిర్వహంచేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. సాధారణ ప్రజలపై ఈ సమావేశాల సందర్భంగా జరిగే సంబరాలు ప్రత్యేక ముద్రవేసే విధంగా పండుగ వాతావరణంలో నిర్వహంచేందుకు సన్నాహాలు పూర్తి కావచ్చాయి. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలలో పార్టీ ముఖ్య నేతలు, అనుచరులతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలు ఇప్పటికే సంబంధిత సమావేశాలను కూడా పూర్తిచేసి కార్యక్రమములో నిమగ్నమయ్యారు.


గులాబీమయం చేయడం లక్ష్యం
ఇప్పటికే నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు డివిజన్ల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వ#హంచారు. కేడర్‌ మనోభావాలతో పాటు, పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికి అందించేందుకు చర్యలు తీసుకుంటూనే అవసరమైన చోట లోటుపాట్లను తొలగించే కార్యక్రమాన్ని కొనసాగించారు. తాజాగా నియోజకవర్గ సంబురాల రోజు నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉండేలా గులాబీ మయం చేయాలని సూచించారు. బిఆర్‌ఎస్‌ తోరణాలు, ప్లెక్సీలు కట్టాలని, గ్రామ గ్రామాన పార్టీ గద్దెలకు రంగులద్దాలి. ఉదయం జెండాలు ఆవిష్కరించాలన్న సూచనలు చేశారు. అక్కడక్కడా వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నా.. ఆత్మీయ సమ్మేళనాలు ఓవరాల్‌గా పండుగ వాతావరణంలో ఉత్సాహం నింపేలా జరుగుతున్నాయని అధిష్టానం భావిస్తోంది.


గ్రామస్థాయి నిర్మాణ పటిష్టత
ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలతో పాటు పార్టీకి చెందిన అన్ని విభాగాల నేతలను, కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలి. అలాగే పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలి. మహళలు సహా, విద్యార్థి యువజన రైతు కార్మిక ఇతర అనుబంధ సంఘాలను కలుపుకుపోవాలి. పార్టీ నిర్మాణాత్మకంగా పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్లీనరీ సందర్భంగా పార్టీ గొప్ప తనాన్ని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. పలు నియోజకర్గాల్లో డెవలప్‌ మెంట్‌ సంక్షేమంపై కరపత్రాలు కూడా ఎమ్మెల్యేలు తయారుచేశారు.

సోషల్‌ మీడియాపై ఫోకస్‌
సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని కేడర్‌కు ఇప్పటికే చెప్పినప్పటికీ మరోసారి ఈ విషయంపై అవగాహన కల్పించనున్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పి కొట్టి ప్రజలను తమ వైపు గెలుచుకునేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు.

టార్గెట్‌.. కేంద్ర ప్రభుత్వం
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ప్రజలకు వివరించాలి. బీజేపీ నాయకుల తీరుని ఎండగడుతూనే ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ తీర్మానాలు చేయాలని, విభజన హామీల అమలుపై నిర్లక్ష్యాన్ని ఎత్తిపడుతూ కేంద్రాన్ని టార్గెట్‌ చేయాలని నిర్ణయించారు.

- Advertisement -

ప్లీనరీకి భారీ బలగం
ఈ ప్లీనరీ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు, 3వేల మందికి తగ్గకుండా పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ బలగమంతా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని అందించే విధంగా ఈ ప్లీనరీలు జరిపేందుకు చర్యలు చేపడుతున్నారు ఇది ఇలా ఉండగా ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు ముందస్తు దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement