Friday, November 22, 2024

ఇక రాష్ట్ర‌వ్యాప్తంగా గులాబీ యాత్ర‌లు..కెటిఆర్ బ‌స్సు టూర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో యాత్రల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు అన్ని యాత్రలను ప్రారంభించాయి. జనంలో ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నాయి. కేంద్రం వర్సెస్‌ రాష్ట్రంగా పరిస్థితు లు తెలంగాణలో మారిపోయాయి. దీంతో ప్రజా క్షేత్రంలోనే తేల్చుకునేందుకు గులాబీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, రూట్‌ మ్యాప్‌లు సిద్ధం అయినట్లుగా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని కడిగేయాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి పార్టీ కుట్రలు చేస్తుంది అంటూ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతుంది. అంతే కాకుండా తెలంగాణకు ఏలాంటి అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుందో కూడా వివరించాలని చూస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో బిజెపి పాలనలో రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డు పడుతుందని, ధాన్యం కొనుగోలులో కేంద్రం కొర్రీలు పెడుతోందని, నిధుల విషయంలో అన్యాయం, రాష్ట్రానికి రావాల్సిన ఇతరత్రా ప్రాజెక్టులు రాకుండా అడ్డుపడుతోందని… ఇలా ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో జరిగిన మంచిని కూడా ఇంటింటికి సమాచారం చేరేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. దళిత బంధు, రైతు బంధు, గృహలక్ష్మి, షాదీ ముబార క్‌, కళ్యాణలక్ష్మితోపాటు ప్రధాన స్కీంలను వివరించనున్నారు. బిఆర్‌ఎస్‌ పాలనలో లబ్ధిపొందిన వారిని ప్రత్యేకంగా ఓటు వేయాలని కోరనున్నారు. పార్టీ ఓటు బ్యాంకు చెదిరిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయబోతున్నారు. పార్టీకి వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయా నియోజవర్గాల్లో ఎక్కువ సభలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.

రంగంలోకి గులాబీ బాస్‌
వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధించే దిశగా బిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తాను సైతం ఉండేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభతో జనంలోకి రాబోతున్నారు. ఉదయం జిల్లా ప్రగతి సమావేశాలను నిర్వహించి.. సాయంత్రం భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆయా జిల్లాల్లో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు.. అక్కడి పెండింగ్‌ సమస్యలను వెంటనే తీర్చేందుకు ఆదేశాలు ఇవ్వనున్నారు. కొత్త హామీలను సైతం ఇస్తూ.. వరాల జల్లులు కురిపించేలా సీఎం కేసీఆర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తనతో పాటు జనంలో కేటీఆర్‌, హరీష్‌ రావు, కవిత కూడా ఉండేలా ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశారు.

కేటీఆర్‌ బస్సు యాత్ర
బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నట్లుగా పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి నియోజకవర్గాన్ని కవర్‌ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సభలు, సమావేశాలు ఉండేలా ప్రయత్నిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. అక్కడి సమస్యలను గుర్తించి వాటిని తీర్చేందుకు కావాల్సిన హామీలను కేటీఆర్‌ ద్వారా ఇప్పించేందుకు సిద్ధం అయ్యారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో కూడా సర్వే రిపోర్టుల ఆధారంగా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరిగే బస్సు యాత్ర విజయవంతం చేసేలా ముఖ్య అనుచరులకు బాధ్యతలను అప్పగించనున్నారు. భవిష్యత్తు సీఎం కేటీఆర్‌ అనే తరహాలో యాత్రను నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. యాత్రకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌కు తుది రూపం ఇచ్చే పనిలో సీఎం కేసీఆర్‌ నిమగ్నమయ్యారు. మొదట పాదయాత్ర చేయాలని భావించినా తక్కువ సమయం ఉండటంతో అన్ని నియోజకవర్గాలను కవర్‌ చేయలేకపోతామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమయం తక్కువ ఉండటంతో ఉన్న టైంను ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచిస్తున్నారు. బస్సు యాత్ర అయితే అన్ని నియోజకవర్గాలను చుట్టేయవచ్చు అని భావిస్తున్నారు. ఎలక్షన్‌ షెడ్యూల్‌ విడుదల అయ్యే లోపే బస్సు యాత్రను పూర్తి చేయనున్నారు. తర్వాత భారీ బహిరం గ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. యాత్ర మాత్రం జూన్‌ మొదటి వారం లేదా జూన్‌ తర్వాత కానీ ఉండేలా నిర్ణయిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రబుల్‌ షూటర్‌కి రెండు జిల్లాలు
సొంత ఉమ్మడి జిల్లాతో పార్టీ మరో ఉమ్మడి జిల్లాను మంత్రి హరీష్‌ రావుకు అప్పగించనున్నారు. ఉమ్మడి మెదక్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాల బాధ్యతలను హరీష్‌ రావుకు కేటాయించనున్నారు. ఖమ్మంలో పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నా.. అక్కడి నుంచి ప్రతి పక్షాలు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధిష్టానం బావిస్తోంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను ట్రబుల్‌ షూటర్‌ బుజాలపై పెట్టనన్నారు. అలాగే సొంత జిల్లాలో పూర్తి పట్టు ఉండటంతో ఆ జిల్లాను కూడా అప్పగించనున్నారు. ఈ రెండు జిల్లాలో అన్ని అసెంబ్లి నియోజకవర్గాలు గెలిచేలా ప్రణాళికలను తయారు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పెద్దగా ఇబ్బంది లేకున్నా.. ఖమ్మంలో మాత్రం టిడిపి , కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌టిపి, కమ్యూనిస్టులతో పాటు సొంత పార్టీ అసమ్మతి నేతలు అధికార పార్టీని ఓడించేందుకు ప్రయత్నిస్తారన్న అభిప్రాయం అధిష్టానం మదిలో ఉంది. దీంతో ఈ జిల్లాను పూర్తిగా హరీష్‌ రావుకు అప్పగించి.. గెలిపించే బాధ్యతను ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement