Saturday, November 16, 2024

విస్త‌ర‌ణ గు’లాబి’

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: భారత రాష్ట్రసమితి విస్తరణ కార్యక్రమాలు వ్యూహాత్మకంగా, జోరుగా సాగుతున్నాయి. ఈనెల 5న మహారాష్ట్ర నాందేడ్‌లో రైతుసభకు సన్నద్దమవుతున్న సీఎం కేసీఆర్‌, ఆ తర్వాత హైదరాబాద్‌ వేదికగా ఈనెల 17న మరో సభకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. నెలాఖరులో విశాఖ వేదికగా మరో సభకు ప్లాన్‌ చేస్తున్నారు. ఒడిస్సాలోనూ.. గుర్తింపు కలిగిన మాజీ సీఎం, పలువురు ప్రభావిత నేతలు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. తెలంగాణ రాజకీ యాలపై పట్టు కొనసాగిస్తూనే, పరిపాలన ను పరుగులు పెట్టిస్తూనే.. జాతీయ రాజకీ యాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరుగులు పెట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్రసమితిగా మారిన తర్వాత తొలిసారి అసెంబ్లిd సమావేశాలు జరుగుతుండగా, ఆఖరి బడ్జెట్‌ సమావేశాలు కూడా ఇవే. ఓవైపు కీలకమైన బడ్జెట్‌, ఇచ్చిన హామీలు, వచ్చే అసెంబ్లిd ఎన్నికల వ్యూహాలు, అస్త్రాలు అన్నింటిపై కసరత్తు చేస్తూనే.. ఇంకోవైపు జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ, వచ్చే లోక్‌సభ ఎన్నికల వ్యూహం అమలు కూడా వేగంగా
జరుగుతోంది. తెలంగాణ పరిపాలన.. జాతీయ పార్టీ విస్తరణ ప్రణాళికలు ఏకకాలంలో సమాంతరంగా పరుగెడుతున్నాయి.

ఎక్కడికక్కడ బాధ్యతలు
జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ కార్యక్రమాలు చాపకింద నీరులా సాగుతున్నాయి. ఈనెల 5న నాందేడ్‌ సభ జరగనుండగా, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ నేతలకు ఈ బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యనేతలు ఇప్పటివరకు చేరకపోగా.. ఈనెల 5న పలు రైతుసంఘాల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున చేరనున్నారు. గతంలో తమ గ్రామాలను విలీనం చేసుకోవాలని కోరిన ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌ గూటికి చేరనున్నారని సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న నేతలు అంటున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నేతృత్వంలో సభ సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఏపీకి చెందిన కీలక నేతలతో బీఆర్‌ఎస్‌ నేతలు చర్చలు కొనసాగిస్తున్నారు. ఏపీలో కాపు వ్యూహంతోనే బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేక్‌ చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను ప్రకటించారు. ఈనెల 17న సచివాలయం ప్రారంభోత్సవంతో పాటు హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనుండగా, తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్‌, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరుకానున్నారు. ఖమ్మం సభ ద్వారా జాతీయ స్థాయిలో ప్రభావిత శక్తిగా నిలబడ్డ సీఎం కేసీఆర్‌, ఇపుడు పరేడ్‌ గ్రౌండ్‌ సభతో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించనున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్థూపం ప్రారంభోత్సవాలు.. సభతో బీఆర్‌ఎస్‌ పునాదిని జాతీయ స్థాయిలో మరింత పటిష్టం చేయనున్నారు. నెలాఖరులో ఏపీ సభకు ప్లాన్‌ చేస్తున్న కేసీఆర్‌, తర్వాత కర్నాటక పాలిటిక్స్‌పై దృష్టి పెట్టనున్నారన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ స్ఫూర్తితోనే పథకాలు అమలు చేస్తామని కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించిన నేపథ్యంలో గత కొద్దిరోజులుగా జరిగిన ప్రచారాలకు ఆయన తెరదించారు. ఒడిశాలోనూ పార్టీ విస్తరించగా, చాపకింద నీరులా బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఊహించినదానికంటే వేగంగా పార్టీ విస్తరణ జరుగుతోందని, అన్ని వైపుల నుండి బీఆర్‌ఎస్‌కు స్పందన లభిస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement