హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించేందుకు బీఆర్‌ఎస్ రెడీ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు.. ఒకపట్టాన ఎవరికీ అర్థం కావు. ఆచరణ పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత ఔరా అంటూ దేశ రాజకీయ పండితులే అబ్బురపడ్డ సందర్భాలు అనేకం. ఇపుడు బీఆర్‌ఎస్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేయడం తెలుగురాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ అనేక సంచలనాలకు నాందికానుంది. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఆంధ్ర రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ప్రాంతంపై సంపూర్ణ అవగాహన ఉన్న సీఎం కేసీఆర్.. ఏపీ రాజకీయాలను సంచలన మలుపులు తిప్పే కార్యాచరణ అమలుకు రంగం సిద్ధం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లి, 25 పార్లమెంట్ స్థానాలపై గురిపెట్టిన సీఎం కేసీఆర్ ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థులు పోటీపడేలా వ్యూహం సిద్ధం చేశారు. ముందుగా బలమైన అభ్యర్థుల గుర్తింపుకు, ఇతర పార్టీల్లోని అసంతృప్తులను గుర్తించి ఆకర్షించేందుకు ప్రత్యేక టీమ్‌లను సిద్ధం చేశారు. ఇప్పటికే ఏపీకి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించి కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్, ఏపీలో కాపు సీఎం నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది.
పక్కాగా ప్రణాళిక
కేసీఆర్ ప్రణాళికతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అనేక నియోజకవర్గాల్లో రానున్న మూడు, నాలుగు మాసాల్లో రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలున్నాయి. ఇప్పటిదాకా ఏపీ రాజకీయాలు ప్రధానంగా రెండు శిబిరాలుగా ఉండగా, నియోజక వర్గాల వారీగా సామాజిక సమీకరణలు.. బీఆర్‌ఎస్‌కు ఎక్కడ అవకాశం ఉందన్న అంశంపై ప్రత్యేక నివేదికలను సీఎం కేసీఆర్ తెప్పించుకున్నారు. దీంతో గురిపెట్టిన నియోజకవర్గాలలో రాజకీయ సమీకరణలను మార్చగల నేర్పు, సామర్థ్యం, వనరులు బీఆర్‌ఎస్‌కు ఉన్నాయి.
స్టార్ క్యాంపెయినర్లు
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌తో పాటు ప్రజలను సమ్మోహపరిచే నేతలను ఆయన తీర్చిదిద్దారు. మంత్రి కేటీఆర్‌కు యూత్‌లో దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండగా, ఏపీలో యువతతో సమ్మేళనాలను నిర్వహించి.. కేటీఆర్‌ను అతిధిగా పంపే అవకాశాలున్నాయని, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి వంటి ప్రాంతాలతో ఐటీ విస్తరణ, పరిశ్రమల విస్తరణ, ఉపాధి అవకాశాలపై వీటిని నిర్వహిస్తే మంచి స్పందన ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇపుడు దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్ గొంతు వినిపిస్తూ వివిధ రాష్ట్రాలలో కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, త్వరలో ఏపీలో కూడా పర్యటించే అవకాశాలున్నాయి. మంత్రి హరీష్‌రావుకు ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు ఉంది. పొలిటికల్ ఈవెంట్ల నిర్వహణలో, ఎన్నికల ప్రణాళికల అమలుకు కేసీఆర్ అనుకున్న లక్ష్యాలను సాధించి చూపడంలో హరీష్‌రావుకు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. ఖమ్మం బీఆర్‌ఎస్ సభ సక్సెస్ చేసి ఏపీ రాజకీయాల వైపు ఆ గాలి మళ్ళించారు. బీఆర్‌ఎస్ ప్రకటన తర్వాత ఏపీ నుండి వలసలు జరుగుతున్నా ముఖ్యనేతలు ఎవరూ.. ఇంకా ఏపీలో అడుగుపెట్టలేదు. త్వరలో ఏపీ పర్యటనకు నేతలు రెడీ అవుతున్నారు.
ప్రచార వ్యూహాలు
తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకమని ఇక్కడి నేతలు ప్రచారం చేయగా, బీఆర్‌ఎస్ ఏపీ ఎంట్రీ తర్వాత ఇలాంటి ప్రచారాలు జరగకుండా.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమ నినాదాన్ని అందుకునేందుకు భారీ ప్రచార వ్యూహాలు సిద్ధం చేసింది. వివిధ అంశాలపై రీసెర్చ్ టీమ్‌లు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. 175 నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని బలమైన నేతలను బరిలోకి దింపేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. తెరవెనుక గులాబీదళపతి కేసీఆర్ పకడ్బందీగా మంత్రాంగం చేస్తున్నారు. తెలంగాణలో హ్యాట్రిక్ పై గురిపెట్టిన బీఆర్‌ఎస్.. ఏపీలోనూ వచ్చే ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధిస్తామని, అధికారానికి చేరువవుతామని గణాంకాలతో చెబుతోంది. ఏపీలో 4నుండి 14 శాతం ఓటు బ్యాంక్ సాధించడంతో పాటు కనీసం 25 స్థానాలు సాధించవచ్చని తాజా పరిస్థితులను బట్టి బీఆర్‌ఎస్ వర్గాలు అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది. 2029లో అధికారం ఖాయంగా సాధించవచ్చని బీఆర్‌ఎస్ ముఖ్యులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏపీ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది.. ఏ ప్రాంతంలో పట్టు చిక్కుతుంది.. గులాబీ వ్యూహంలో చిక్కే నేతలు ఎవరు? కేసీఆర్ టీంలోకి వెళ్ళేదెవరు? ఏ మేరకు బీఆర్‌ఎస్ ప్రణాళికలు వర్కవుట్ అవుతాయి. రానున్నరోజుల్లో స్పష్టత రానుంది.