Friday, November 22, 2024

భారాస విస్త‌ర‌ణ వ్యూహాలు… స‌రిహ‌ద్దు రాష్ట్రాల‌పై గురి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : బీఆర్‌ఎస్‌ ఏర్పాటు తర్వాత ఆవిర్భావ ఉద్దేశాలను, లక్ష్యాలను దేశం ముందుంచిన పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇక విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ముందుగా సరిహద్దు రాష్ట్రాల్లో పట్టు సాధించి దక్షిణాదిలో పాగా వేసేందుకు వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే వచ్చేనెల 5న మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కేంద్రంగా భారీ బహిరంగ సభను నిర్వహించి బీఆర్‌ఎస్‌ బలాన్ని చాటుకునే దిశగా చర్యలు ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో జన సమీకరణ సమస్య లేకుండా ఉంటుందని, అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ఫలాలు తమకూ కావాలంటూ అనేక సందర్భాల్లో అక్కడి ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నాం దేడ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అలాగే వచ్చేనెల 17న ప్రతిష్టాత్మక సచివాలయ ప్రారంభోత్సవానికి మూడు రాష్ట్రాల నుంచి ప్రముఖులు వస్తున్నందున అదేరోజు పరేడ్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభకు ప్లాన్‌ చేశారు. ఈ రెండు సభలను ఖమ్మం తరహాలోనే విజయవంతం చేసి ఇక పొరుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాలన్నది సీఎం కేసీఆర్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రతిరోజూ ఆయన ఎక్కువ సమయం బీఆర్‌ఎస్‌ విస్తరణ కోసమే కేటాయిస్తూ, మద్దతు కూడగట్టుకునే క్రమంలో అనేకమంది నేతలకు స్వయంగా ఫోన్‌ చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేసీఆర్‌ అసెంబ్లిd తర్వాత మరింత వేగంతో కార్యాచరణను ముందుకు నడిపించాలని నిర్ణయించు కున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వరుస పర్యటనలు, సమావేశాలతో మద్దతు కూడగట్టుకోబోతున్నారు. జన సమీకరణకు సన్నాహాలు వచ్చేనెలలో రెండు బహిరంగ సభల లక్ష్యాలను నిర్ధేశించిన తరుణంలో పెద్దయెత్తున జనసమీకరణ చేయడానికి బాద్యులు సిద్ధమయ్యారు. నాందేడ్‌ తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో నిజాబామాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి జనాన్ని తరలించే ఏర్పాట్లకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే నాందేడ్‌ సభ ఏర్పాట్ల కోసం మంత్రి ఇంద్రకిరణ్‌ రెడ్డిని ఇన్‌ఛార్జిగా కేసీఆర్‌ నియమించారు.

పార్టీ సీనియర్‌ నేత బాలమల్లును కూడా ఈ సభకు ఇన్‌ఛార్జిగా బాద్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, జీవన్‌ రెడ్డి, బాల్క సుమన్‌లు నాందేడ్‌ జిల్లాలో పర్యటించి సభను నిర్వహించే స్థలాన్ని ఇప్పటికే పరిశీలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో ఫిబ్రవరి 17న మరో భారీ బహిరంగసభ జరగనున్నందున ఇక్కడ కూడా సన్నాహాలు చేస్తున్నారు. నాందేడ్‌ సభకు సీఎం కేసీఆర్‌తో పాటు- మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు సభకు హాజరుకానున్నారు. ఇప్పటికే నాందెడ్‌లో బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించి చేరికల కోసం కొంత మందిని సంప్రదించారు. గత మూడు రోజులుగా సీఎం కేసీఆర్‌ ఈ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశమై సభను విజయవంతం చేసేందుకు, ఏర్పాట్లపైనా దిశానిర్దేశం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీఆర్‌ఎస్‌ పోటీ-కి సిద్ధంగా ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే, పోటీ- వద్దని కేసీఆర్‌ అనుకుంటు-న్నట్లు సమాచారం. నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్రకు సంబంధించి మార్చిలో ఎన్నికలు జరిగేలా ఇప్పటికే నోటిఫికేషన్‌ వచ్చింది. అక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ- చేసేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నా, ఇంత తక్కువ సమయంలో ఎన్నికల బరిలో నిలవడం అసాధ్యమని భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ- చేయడం కన్నా పార్టీ బలోపేతం గురించే ఎక్కువగా కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు.

కాంగ్రెస్‌తో భాగస్వామ్యమున్నవారితోనూ కేసీఆర్‌ సఖ్యత
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ సభలో కూడా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు పాల్గొన్నారు. అయితే ఖమ్మంలో జరిగిన సభకు మలివిడత కంటి వెలుగు ప్రారంభోత్సవానికి కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌, ఫిబ్రవరి 17న జరగబోతున్న సచివాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌ పార్టీతో భాగస్వాములుగా ఉన్న ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్‌ జన్మదినమైన ఫిబ్రవరి 17న నూతనంగా నిర్మించిన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, ఝార్కండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తరఫున ఆయన ప్రతినిధి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్‌ హాజరవుతున్నారు.

- Advertisement -

కేసీఆర్‌ సభలకు జాతీయ ప్రాధాన్యత
వచ్చేనెల 17న జరగనున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు కాంగ్రెస్‌తో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నందున ఈ సభకు జాతీయస్థాయి ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలోనే భారత రాష్ట్ర సమితి ఏర్పాటు- ప్రకటన సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తమ మద్దతు ప్రకటించారు. ఇక తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ విలీనానికి ముందుకొచ్చింది. కర్ణాటకలో పాదయాత్రలో ఉన్న సందర్భంగా కుమారస్వామి ఖమ్మం సభకు హాజరు కాలేదు. ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఖమ్మం సభకు కూడా హాజరయ్యారు. ఢిల్లీ, పంజాబ్‌, కేరళ ముఖ్యమంత్రలతో సహా సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా ఖమ్మం సభలో గవర్నర్ల వ్యవస్థపై మండిపడ్డారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మెచ్చుకోవడంతోపాటు-గా తమ రాష్ట్రాల్ల్రో అమలు చేస్తామని కూడా చెప్పారు. ఇక 17న జరగబోతున్న సభలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి సోరన్‌, బీహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్జెడి నేత తేజస్వి యాదవ్‌, జేడీయు జాతీయ అధ్యక్షుడు లలన్‌ సింగ్‌ ఎలా రియాక్ట్‌ అవుతారు ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.

నార్త్‌ లోనూ పాగాకు ప్రయత్నం
ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్‌, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బీఆర్‌ఎస్‌కు మద్ధతుగానే ఉన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా బీఆర్‌ఎస్‌ రెండో సభకు హాజరుకానుండడంతో దాదాపు దక్షిణాదిలోని రాష్రాలన్నింటిలో బీఆర్‌ఎస్‌కు బలం ఉన్నట్లేనని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఇక ఖమ్మం సభకు ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ సింగ్‌ మాన్‌తోపాటు- ఉత్తరాది కీలక నేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌ కూడా వచ్చి వెళ్లారు. ఇప్పుడు హైదరాబాద్‌ సభకు జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ మనుమడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ రానున్నారు. నార్త్‌లో కూడా బీఆర్‌ఎస్‌కు మద్ధతు ఖచ్చితంగా ఉంటుందన్నది కేసీఆర్‌ మదిలో ఉన్న బలమైన నమ్మకం. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో త్వరలోనే భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ఆయన కసరత్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement