హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రాజకీయ భీష్ముడిగా పేరున్న కేసీఆర్ ప్రణాళికలు అనూ హ్యంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే.. కానీ త్వరలోనే రానున్న సార్వత్రిక ఎన్నికలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయని జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా.. వాటిని అనుకూలంగా మలుచుకోవడంలో ఆయనది అందెవేసిన చెయ్యి అనేది గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారం తమదేనని సరికొత్త వ్యూహాలు, ఎత్తుగడలతో కత్తులు నూరుతున్న కాంగ్రెస్, బీజేపీలకు అందనంత ఎత్తులో కేసీఆర్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్‌తో సంసిద్ధమై ఉన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా.. వద్దా.. అన్నది పార్టీ, ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ నిర్ణయం. అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేసినా, ఆ తర్వాత రెండు, మూడు నెలల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. కానీ, ఈ ఏడాది ఈసీ ఇప్పటికే అన్ని రకాల వనరులతో సంసిద్ధమై ఉంది. ఒకవేళ అసెంబ్లిని ముందుగా రద్దు చేయకపోయినా నవంబర్ లేదా డిసెంబర్‌లో జరుగుతాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన నేపథ్యంలో, గతంలో మాదిరిగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు కేసీఆర్ అభ్యర్థులపై కూడా పూర్తి కసరత్తు చేశారు. అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకుని రంగంలోకి దిగారు. తనకున్న రాజకీయ అనుభవంతో ఎక్కడా వెనుతిరిగి చూడకుండా రెండోసారి విజయాన్ని అందుకున్నారు. ఈసారి కూడా ముందస్తుకు వెళ్లాలనుకుంటే.. అదేస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక అవసరమని భావించిన దళపతి… అభ్యర్థుల విషయంలో ముందుగానే క్లారిటీ ఇచ్చారు.
కేసీఆర్ ఎలక్షన్ ప్రిపరేషన్స్ విషయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు గట్టి నమ్మకం, ధీమాతో ఉన్నారు.
గత అనుభవాలను గుణపాఠంగా విజయమే లక్ష్యంగా దూసుకుపోవాలని అధినేత కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరితో దాదాపు మూడు నెలల కిందటే మీటింగ్ పెట్టి ధైర్యాన్ని నూరిపోశారు. దీంతో ముందస్తు ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా ఎదుర్కొనేందుకు ప్రస్తుతానికి బీఆర్‌ఎస్ నియోజకవర్గస్థాయి కమిటీలు అన్ని కోణాల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు- ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఎమ్మెల్యేలంతా రెండు నెలల క్రితమే ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్ళిపోయారు. కేసీఆర్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించినా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా టిక్కెట్ల విషయంలో -టె-న్షన్ పడుతున్నారు. ఎలాగైనా తమకే పార్టీ టికెట్ రావడం గ్యారెంటీ- అయినా, ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉందా? లేదా? తమపై నియోజకవర్గ ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది.? అనే విషయాలపై సొంతంగా సర్వేలకు దిగుతున్నారు. ఈ మేరకు కొన్ని ప్రైవేటు- సర్వే సంస్థలకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు- సమాచారం. నియోజక వర్గంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? జనాల్లో తమపై ఎటు-వంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఏఏ విషయాల్లో వ్యతిరేకత ఉంది? అనే విషయాలపై సర్వేల ద్వారా ఆరా తీస్తూ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు ప్రజలకి నేరుగా ఫోన్ చేసి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మీకున్న అభిప్రాయం ఏమిటి? బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది? ఇంకా ప్రధానంగా ఉన్న సమస్యలు ఏమిటి? మీ ఎమ్మెల్యే నుంచి, ప్రభుత్వం నుంచి ఇంకా మీరు ఏమేమి కోరుకుంటున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు ముమ్మరం
ఈ ఫీడ్ బ్యాక్ ద్వారా ప్రధానంగా నియోజకవర్గ ప్రజల్లో తమపై ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి? ఏఏ సమస్యలను పరిష్కరిస్తే తమకు తిరుగులేకుండా ఉంటు-ందనే విషయాలపై దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది వచ్చే ఎన్నికల్లో ఈ సర్వేల రిపోర్ట్‌లను ఉపయోగించుకోబోతున్నారు. ఎలాగైనా గెలిపించుకోవాలన్న తాపత్రయంతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పర్యటిస్తూ, బహిరంగ సభలు నిర్వహిస్తారని, ఆయన మాటల తూటాలే ఆయుధంగా తమకు గెలుపు వరిస్తుందని గట్టి ధీమాతో ఉన్నారు. అంతకన్నా ముందుగానే అధినేత నియోజకవర్గాల పరిస్థితులపై సర్వేలు చేయిస్తారని, ఆ మేరకు పరిస్థితులను చక్కబెడుతారని, అదే సమయంలో తాము వ్యక్తిగతంగా సర్వే చేయించుకుని ఎన్నికల సమయం నాటికి ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేసుకుంటే తమకు తిరిగి ఉండదనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా మంత్రులపై వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉందనే సంకేతాలు రావడంతో వారు కూడా అలర్ట్ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మూడోసారి అధికారం కోసం ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేస్తుందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. వరుసగా గెలుస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనా జనాలకు కొంత విరక్తి ఉండే అవకాశం లేకపోలేదని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. మార్పు వస్తే మంచిదని భావనతో ఉన్న కొద్ది నియోజకవర్గాల్లో ఆ అభిప్రాయాలు జనాల్లో ప్రబలకుండా మళ్ళీ గెలిపించుకునే విధంగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు నానా తంటాలు పడుతున్నారు.
గత అనుభవాలు ఇప్పుడు గుణపాఠాలు
అధికారంలో ఉన్న పార్టీకి సాధారణ ఎన్నికల్లో కొంత వ్యతిరేకత ఉండటం సహజం. ఆ పార్టీ తాము వీక్‌గా ఉండటమో లేదా తమ ప్రతినిధిపై వ్యతిరేకత ఉండటం వంటి కారణాలతో నియోజకవర్గాల్లో సిట్టింగులకు కాకుండా వేరే వ్యక్తులకు సీట్లు- కేటాయిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇప్పటికే రెండుసార్లు భారీ మెజారిటీ-తో అధికారంలో కొనసాగుతున్న బీ-ఆర్‌ఎస్ పార్టీ మాత్రం గత ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు- ఇస్తామని ప్రకటించినట్లు-గానే.. వచ్చే ఎన్నికల్లో కూడా సిట్గింగులకే సీట్లు- ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటీ-వల జరిగిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో కూడా ఇలాగే ప్రకటించినప్పటికీ.. కొన్ని స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చి, గెలిపించుకుంది. అయితే గతంలో కంటే ఈసారి పార్టీ నుంచి పోటీ- చేస్తామని భావిస్తున్న నాయకుల సంఖ్య అధికంగా ఉంది. ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చినవారితో పాటు- సొంత పార్టీలోనే ఏళ్లుగా టికెట్‌ను ఆశిస్తున్నవారు కూడా ఉన్నారు. ఇప్పటికే కొందరు ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనడం, సొంత కేడర్‌ను తయారు చేసుకోవడం వంటి పనుల్లో బిజీగా ఉండగా, తాజాగా సీఎం కేసీఆర్ నిర్ణయంతో వారిలో కొంత కలవరం మొదలైంది. సిట్టింగులకే సీట్లు- ఇస్తే.. తమ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా వారిలో ఉత్పన్నమవుతున్నాయి. ముందస్తుగా సిట్టింగులకు టికెట్లు- అని ప్రకటించడం ద్వారా కొంత ఆందోళనలో ఉన్న సిట్టింగులను కాపాడుకునే ప్రయత్నం చేసినట్లు-గా కొందరు భావిస్తుండగా, స్థాన, ఆర్థిక, అంగబలం ఉన్న సిట్టింగులు అయితేనే వచ్చే ఎన్నికల్లో మూడోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయమనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉన్నట్లు- తెలుస్తోంది.