హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఈ నెల 10న బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా భేటీ- కానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గంతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, అన్ని స్థాయిల్లో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారంతా విధిగా పాల్గొనాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో కీలకమైన నిర్ణయాలు, ఎన్నికల నేప థ్యంలో కొత్త వ్యూహాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. మంత్రిమండలి సమావేశం అనంతరం జరుగుతున్న పార్టీ కీలక సమావేశం కావడంతో రాజకీయంగా అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేరోజు ఢిల్లీలోని జంత ర్‌మంతర్ వద్ద మహిళా బిల్లు డిమాండ్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయనున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటు-లో ప్రవేశ పెట్టాలని ఆమె గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకువచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ దీక్షలో పాల్గొనాలని అన్ని పార్టీలు, సంఘాలకు ఆహ్వానాలు పంపారు. దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు కవితకు మద్దతుగా దీక్షలో పాల్గొననున్నారు.
మరోవైపు ఈనెల 10వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన.. బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనుంది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ పార్లమెంటు- సభ్యులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్‌లు, డిసిఎమ్‌ఎస్, డిసిసిబి చైర్మన్‌లు పాల్గొంటారు. ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రతీఒక్కరూ ఈ సమావేశానికి తప్ప నిసరిగా హాజరుకావాలని అధినేత కేసీఆర్ సూచించారు. అటు దేశ రాజ ధానిలో, ఇటు రాష్ట్ర రాజధానిలో ఒకేరోజు కీలకమైన రాజకీయ వేదికలు ఉండడం చర్చనీయాంశంగా మారింది.