మాంసం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. చికెన్ ధర ఆకాశాన్ని అంటుతున్నాయి. చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. రోజు రోజుకూ పెరుగుతూ మాంసం ప్రియుల జేబులకు చిల్లు పెడుతోంది. పౌల్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధింగా హోల్‌సేల్ మార్కెట్‌లో బాయిలర్ చికెన్ కిలో రూ.312కు చేరింది. కొద్ది రోజుల క్రితం వరకు చికెన్ ధర కిలో రూ.280 ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డులను అధిగమించే ఏకంగా రూ.312కు చేరడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభం నుంచి చికెన్ ధర కిలో రూ.200 మార్కును దిగకుండా కొనసాగుతోంది. పెరుగుతున్న ధరలతో చికెన్ కొనాలంటే సామాన్యుడు కళ్లు తేలేయాల్సిన పరిస్థితి నెలకొంది. చికెన్ ధర వింటే సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
ప్రస్తుతం వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతోనే రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. ఎండాకాలం కావడంతో పౌల్ట్రీల్లో కోళ్లు పెరుగుదల సమయం ఎక్కువగా ఉంటుంది. వాటిని మార్కెట్‌కు తరలించేందుకు కావాల్సిన బరువు పెరిగేందుకు ఇతర సీజన్స్‌తో పోలిస్తే ఎక్కువ రోజులు పడుతుంది. దీంతో దాని ప్రభావం ఉత్పత్తిపై పడటంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు ఈ ఏడాది కోళ్లకు మేతగా ఉపయోగించే మొక్కజొన్న, ఆయిల్ తీసిన సోయ, తవుడు ధరలు భారీగా పెరిగాయి. దీంతో వీటి ప్రభావం కారణంగా కూడా చికెన్ ధర ఆకాశాన్ని అంటుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.