బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 (96) చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. స్కాట్లాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్న రాణి మరణ వార్తను ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో కుటుంబసభ్యులంతా ముందుగానే స్కాట్లాండ్‌లోని రాణి నివాసానికి చేరుకున్నారు. రాణి ఎలిజబెత్ భౌతిక కాయాన్ని శుక్రవారం బ్రిటన్ ప్యాలెస్ కు తీసుకురానున్నారు. రాణి మరణంతో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. 70 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన రాణిగా ఎలిజబెత్ 2 గుర్తింపు పొందారు.
1922లో జన్మించిన ఆమె ప్రిన్స్ పిలిప్ మౌంట్ బాటెన్‌ను 1947లో వివాహం చేసుకున్నారు. 22 ఏళ్ల వయస్సులోనే బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. రాణి 70 ఏళ్ల సేవలకు గుర్తుగా గత జూన్ లో దేశ వ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు కూడా నిర్వహించారు. ఇక.. బ్రిటన్ రాణి ఎలిజబెత్2 మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కాలపు గొప్ప నాయకురాలిగా రాణి ఎలిజబెత్ నిలిచిపోతారని మోదీ అన్నారు. బ్రిటన్ కు సమర్థమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని రాణి ఎలిజబెత్ అందించారని కొనియాడారు.
==================================================
బ్రిటన్ ఇక రాజు పాలనలోకి..
బ్రిటన్ ను సుదీర్ఘ కాలం పాలించిన రాణి ఎలిజబెత్-2 మరణం తర్వాత యూకే ఇక రాజు పాలనలోకి వెళ్లనుంది. ఎలిజబెత్2 పెద్ద కుమారుడు చార్లెస్ (73) బ్రిటన్‌కు కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన కింగ్ చార్లెస్-3గా వ్యవహరించనున్నారు. బ్రిటన్ రాజకుటుంబ నియమాల ప్రకారం.. దేశాధినేత మరణిస్తే వారి మొదటి వారసుడు/వారసురాలు రాజు/రాణిగా మారిపోతారు. అధికారికంగా పట్టాభిషేకం, లాంఛనాలకు కొన్ని నెలల సమయం పడుతుంది.
అయితే, రాజు/రాణి మరణించిన 24 గంటల్లోపే కొత్త అధినేత పేరును లండన్ లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ నుంచి యాక్సెషన్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత కొత్త రాజుకు బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు విధేయత ప్రకటిస్తారు. కొత్త రాజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ విషయాన్ని బ్రిటన్ లో బహిరంగంగా ప్రకటన చేస్తారు.
రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్ కు అధినేతగా చార్లెస్ వ్యవహరిస్తారు. ఇకపై 14 కామన్వెల్త్ దేశాలకూ రాజుగా ఉంటారు. చార్లెస్ 1948 నవంబరు 14న బకింగ్‌హామ్ ప్యాలె్‌సలో జన్మించారు. ఎలిజబెత్-2 నలుగురు పిల్లల్లో ఆయనే పెద్దవారు. చార్లెస్ 1981లో డయానాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు విలియమ్, హ్యారీ ఉన్నారు.
అయితే, 1992లో చార్లెస్ -డయానా దంపతులు విడిపోయారు. 1997లో జరిగిన రోడ్డు ప్రమాదంలో డయానా మృతి చెందారు. ఈ విషయంలో చార్లెస్ విమర్శలను ఎదుర్కొన్నారు. 2005లో 56 ఏళ్ల వయసులో చార్లెస్.. కెమెల్లా పార్కర్‌ను రెండో వివాహం చేసుకున్నారు.