Friday, November 22, 2024

బ్రిట‌న్ ఛార్లెస్3 ప‌ట్టాభిషేకం.. 100 మిలియన్‌ పౌండ్ల ఖ‌ర్చు

ఏడు ద‌శాబ్దాల‌పాటు బ్రిట‌న్ ని పాలించిన క్వీన్ ఎలిజిబెత్2 గ‌తేడాది సెప్టెంబ‌ర్ లో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. అనంతరం బ్రిటన్ తదుపరి రాజుగా ఛార్లెస్‌-3 బాధ్యతలు చేపట్టారు. అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం మాత్రం మే 6న జరగనుంది. ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా వెళ్లాయి. రాజు పట్టాభిషేకానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మిలియన్‌ పౌండ్లు ఖర్చుపెడుతున్నట్లు అంచనా. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.1020 కోట్లు అన్నమాట.

అయితే, ఈ ఖర్చు మొత్తం బ్రిటన్‌ ప్రభుత్వమే చెల్లించనుంది. బ్రిటీష్ రాజవంశీకులు వివాహాలను సొంత ఖర్చుతో చేసుకుంటారు. పట్టాభిషేకానికి అయ్యే ఖర్చు మాత్రం ప్రభుత్వమే భరిస్తుందట. ఈ పట్టాభిషేకానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే కార్యక్రమ టీవీ ప్రసార హక్కుల నుంచి వచ్చే ఆదాయమే భారీగా ఉండనున్నట్లు సమాచారం. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబే లో జరిగే ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని 3.7కోట్ల మంది వీక్షిస్తారని అంచనా. ఈ కార్యక్రమం కోసం 700 ఏండ్ల చారిత్రక నేపథ్యం కలిగిన ఓ కుర్చీని కూడా సిద్ధం చేస్తున్నారు. 1953లో బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌-11 పట్టాభిషేక మహోత్సవం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నేరుగా 3 లక్షల మంది తిలకించారట. అప్పట్లోనే రాణి పట్టాభిషేకానికి 1.5 మిలియన్‌ పౌండ్లు ఖర్చు పెట్టారట. ప్రస్తుత కరెన్సీ విలువతో పోలిస్తే అది సుమారు 50 మిలియన్‌ పౌండ్లు. అంటే సుమారుగా రూ.528.7 కోట్లన్నమాట.

Advertisement

తాజా వార్తలు

Advertisement