Thursday, November 21, 2024

చైనా కుటిల బుద్ధి.. పాంగాంగ్‌ సరస్సుపై వంతెన, వేగంగా నిర్మాణ పనులు

న్యూఢిల్లి : భారత్‌తో సరిహద్దు విషయంలో.. చైనా తన బుద్ధి మార్చుకోవడం లేదు. రోజురోజుకూ కవ్వింపు చర్యలు పెంచుతున్నది. పాంగాంగ్‌ సరస్సుపై వంతెన నిర్మాణం చేపడుతున్నది. ఎంతో వేగంగా ఈ పనులు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తున్నది. తూర్పు లడఖ్‌లోని ఈ సరస్సుపై 400 మీటర్ల కంటే పొడవైన వంతెన నిర్మిస్తున్నట్టు శాటిలైట్‌ చిత్రాల ద్వారా తెలిసింది. ఈ నిర్మాణం పూర్తయితే.. భారత్‌, చైనా మధ్య కీలకమైన ఫ్లాష్‌ పాయింట్‌గా ఉన్న ప్రాంతంలో డ్రాగన్‌ సైన్యానికి ఎంతో సానుకూలంగా మారుతుంది. 8 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెన పాంగాంగ్‌ ఉత్తర తీరంలోని చైనా సైనిక స్థావరానికి దక్షిణంగా ఉంది. భారత్‌, చైనా మధ్య 2020లో కొనసాగిన ప్రతిష్టంభన సమయంలో.. ఫీల్డ్‌ హాస్పిటల్స్‌, సైనిక వసతులను ఈ ప్రాంతంలో ఆ దేశం ఏర్పాటు చేసింది.

జనవరి 16న ఉప గ్రహాలు తీసిన ఫొటోల్లో వంతెన స్తంభాలను కాంక్రీట్‌ స్లాబ్‌లతో అనుసంధానించడానికి చైనా నిర్మాణ కార్మికులు భారీ క్రేన్‌ను ఉపయోగిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. నిర్మాణ పరిధిని బట్టి వంతెన కొన్ని నెలల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రాంతంలోని చైనా ప్రధాన స్థావరం రుటోగ్‌తో అనుసంధానికి మాత్రం మరిన్ని నెలల సమయం పడుతుంది. వంతెన నిర్మాణ విషయం జనవరిలోనే వెలుగులోకొచ్చింది. హై రిజ్యూలేషన్‌ శాటిలైట్‌ చిత్రాలు.. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. పాంగాంగ్‌ సరస్సు ఉత్తర తీరం నుంచి రుటోగ్‌ స్థావరానికి చేరుకోవాలంటే.. 200 కి.మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వంతెన పూర్తయితే.. 150 కి.మీ దూరం తగ్గిపోనుంది. ప్రతికూల వాతావరణం, భారీ మంచులో నిర్మాణం చేస్తున్నట్టు ఇంటెల్‌ ల్యాబ్కు చెందిన పరిశోధకుడు డామియన్‌ సైమన్‌ తెలిపారు. చైనా సుమారు 60 ఏళ్ల కింద చైనా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో ఈ వంతెన నిర్మిస్తున్నదని, భారత్‌ ఇలాంటి చట్ట విరుద్ధాన్ని ఎన్నడూ అంగీకరించదని భారత్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement