Monday, November 18, 2024

పెళ్లి పీట‌ల‌పై వరుడు అరెస్ట్

భువ‌నేశ్వ‌ర్

అప్పటి వరకు పెళ్లి ఊరేగింపు ధూమ్​ ధామ్​గా సాగింది. వరుడి కుటంబసభ్యులు డ్యాన్స్​లతో దుమ్మురేపారు. ఎంతో ఉత్సాహంగా సాగిన ఊరేగింపు మండపానికి చేరుకుంది. వరుడికి వధువు కుటుంబసభ్యులు సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. మండపంలోనికి వెళ్లిన వరుడు.. కాస్త సేద తీరుతున్నాడు. ఇంతలోనే మహిళా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నవ వరుడిని అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు.
ఒడిశాలోని బార్​గఢ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఢెంకానాల్​కు చెందిన అజిత్​ కుమార్​ భోయ్.. ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి ఇటీవలే బెహెరాపాలి గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. మంగళవారం రాత్రి.. వివాహ ముహుర్తాన్ని ఖరారు చేశారు పెద్దలు. అందుకు వరుడు అజిత్​.. ఊరేగింపుగా మండపానికి చేరుకున్నాడు. ఇంతలోనే అక్కడి చేరుకున్న భువనేశ్వర్ మహిళా పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసి.. మరో యువతిని వివాహం చేసుకుంటున్నందుకే అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాలు ప్రకారం అజిత్​ భోయ్​.. గత రెండేళ్లుగా భువనేశ్వర్​ చెందిన ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. కానీ ఇటీవలే మరో యువతితో పెళ్లి ఫిక్స్​ చేసుకున్నాడు. అది తెలుసుకున్న వరుడి ప్రియరాలు.. తన ప్రియుడు అజిత్‌పై భువనేశ్వర్​ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతడిపై పలు సెక్షన్ల కింద నమోదు చేసుకున్న పోలీసులు.. పెళ్లి జరుగుతున్న మండపానికి నేరుగా వెళ్లి అరెస్ట్​ చేశారు. నిందితుడు అజిత్​కు వధువు కుటుంబసభ్యులు అందించిన బంగారు గొలుసు, ఉంగరం, చేతి గడియారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని వధువు తరఫు వారికి అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement