ఆ యువతికి పెళ్లి కుదిరింది.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా హ్యాపీగా ఉన్నారు. పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి. ముహూర్తం కూడా దగ్గరపడింది. పెళ్లికి కొన్ని గంటల ముందు జరిగిన ఓ కార్యక్రమంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా వరుడు తనను చెంపదెబ్బ కొట్టాడని వధువు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా పన్రుటిలో జరిగింది. వధూవరులిద్దరూ నృత్యం చేస్తున్నప్పుడు.. పెళ్లికూతురు బంధువు ఒకరు ఆమె చేతులు పట్టుకుని డ్యాన్స్ చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
పెళ్లికి వచ్చిన రిలేటివ్స్ లో ఒకతను ఆ పెళ్లికూతురు భుజాలపై చేతులు వేసి డ్యాన్స్ చేయడంతో వరుడు ఉలిక్కిపడ్డాడు. దీంతో ఆ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి నుంచి పెళ్లికూతురును దూరంగా తీసుకెళ్లాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి చెంపపై కొట్టాడు. అయితే.. తాళి కట్టడానికి వరుడు వేదికపైకి రాగానే వధువు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అందరిముందు అమ్మాయిని చెంప దెబ్బ కొట్టాడని ఆరోపించారు. తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేయాలని వధువు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు కూడా ఆమోదించారు. అంతేకాకుండా తమ బంధువుల్లోని మరో అబ్బాయితో మంచి ముహూర్తంలో పెళ్లి జరిపించారు.
అయితే.. జనవరి 20న తొలుత పెళ్లి జరగాల్సి ఉండగా.. వారి ఆచారం ప్రకారం పెళ్లికి ఒకరోజు ముందు అంటే జనవరి 19న రిసెప్షన్ నిర్వహించారు. ఇక్కడ మరో ట్విస్టు ఏంటంటే.. పెళ్లి ఏర్పాట్లకు తాము ఖర్చు చేసిన 7 లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాలని వరుడు పన్రుటి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పే జీలను ఫాలో అవ్వండి..