తమిళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార గతినే మార్చేసిన ఇటుక కథ ఇది. తనకు ఇంత పేరు వచ్చేస్తుందని ఇటుక కూడా ఊహించి ఉండదు బహుశా. ఈ ఇటుక తమిళనాట విపక్ష డిఎంకెకు ఓ ఆయుధమైంది. తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం వాడి వేడిగా సాగాయి. భానుడి భగభగలను కూడా లెక్కచేయకుండా ప్రధాన పార్టీల నేతలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో తాను చేసిన పని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటుక రాయి దొంగంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇటుక రాయిని దొంగిలించిన ఉదయనిధిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఓ బీజేపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార అన్నాడిఎంకె కూటమి, విపక్ష డిఎంకె కూటమి జోరుగా ప్రచారాలు సాగించాయి. ఇందులో భాగంగా డిఎంకె అధినేత కుమారుడు, చెపాక్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఉదయ్ నిధి స్టాలిన్ తనదైన స్టైల్‌లో ఎన్నికల ప్రచారం దూసుకెళ్లారు. ఓ ప్రచారంలో పాల్గొన్న ఉదయ్ నిధి ఓ ఇటుక రాయిను పట్టుకుని… మోడీ సర్కార్‌పై విమర్శలు సంధించారు. మధురైలో మూడేళ్ల క్రితం ఎయిమ్స్ కడతానని బిజెపి సర్కార్ మాట ఇచ్చిందని… ఇటీవల తాను అక్కడ ప్రచారానికి వెళ్లి ఎయిమ్స్ ఎక్కడ అని వెతికానని… తీరా చూస్తే కట్టింది ఇది అంటూ ఒక ఇటుకను తీసి చూపించారు. మూడేళ్ల నుండి బిజెపి కడుతున్న ఎయిమ్స్ ఇదేనంటూ ఎద్దేవా చేయడంతో అక్కడి జనం పగలబడి నవ్వారు. దీంతో బిజెపికి ఇరకాటంలో పడినట్లయింది. మధురైలో ఎయిమ్స్ నిర్మాణానికి 2019లో ప్రధాని మోడీ పునాది రాయి వేయగా… నిర్మాణ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్నాడిఎంకె, మోడీ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు ఉదయ్… ఇటుకనుఎత్తి చూపిస్తూ… ఎయిమ్స్ అభివృద్ధి సున్నా అంటూ ఎన్నికల ప్రచారం సాగించారు.
ఇక తమ పరువు తామే తీసుకుంటారన్న చందంగా ఓ బిజెపి కార్యకర్త మరుసటి రోజు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి… మధురై మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణ స్థలం నుండి ఉదయ్ నిధి స్టాలిన్ దొంగతనం చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో అన్నాడిఎంకె, బిజెపి కూటమి మరింత అభాసుపాలు అయింది. ఈ ఫిర్యాదు… విపక్ష కూటమి ప్రచారానికి మరింత ప్రేరణనిచ్చినట్లైంది.
అప్పటి వరకు డిఎంకె నేతలు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం సాగించగా… ఉదయ్నిధి స్టాలిన్ ఇచ్చిన ప్రేరణతో… వారికి మరింత ధైర్యం చేకూరింది. ఇక వారి ఎన్నికల ప్రచారానికి తిరుగులేకుండా పోయింది. వీటికి కౌంటర్ ఇద్దామనుకుని అన్నాడిఎంకె, బిజెపి కూటమి భావించినప్పటికీ… సత్తా చాటలేక చతికల పడింది. ఈ విధంగా ఆ ఇటుక తమిళ రాజకీయాన్ని ఒక్కసారిగా మార్చేసింది.