తమది ఉద్యమ పార్టీ అని.. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేశామని.. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని ప్రజలను ఇబ్బందులకు గురిచేయబోమన్నారు మంత్రి హరీశ్‌రావు. అప్పుడైనా.. ఇప్పుడైనా ప్రజలు బాధపడితే తమకు సంతోషం కలగదన్నారు. అందుకే ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు హరీశ్.. రేపటి మహాధర్నా గురించి మీడియాతో మాట్లాడారు హరీశ్… ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణ ప్రజల పక్షాన మేము ఎపుడూ ఉంటాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షానే నిలబడతాం. ఆనాడు ఆంధ్రలో విలీనం అయిన మండలాల గురించి బంద్ నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ఇప్పుడు మహాధర్నా చేపడుతున్నాం. అన్ని రాష్ట్రాలకు ఒకే విధానాన్ని కేంద్రం అవలంబించాలి’’.. అన్నారు.
రైతుల పక్షాన నిలబడేందుకే ఈ మహా ధర్నా చేస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు మొత్తం ఈ ధర్నాలో పాల్గొంటారని స్పష్టం చేశారు మంత్రి హరీశ్‌రావు. ‘‘ప్రజాస్వామ్యపక్షంగా ధర్నా చేయబోతున్నాం. కేంద్రం కొత్తగా ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రభుత్వ బాధ్యత . గతంలో కేంద్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేశాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తప్పించుకునే యత్నం చేస్తోంది. రేపటి ధర్నా మా బల ప్రదర్శన కాదు. రైతుల పక్షాన కేంద్రం పై ఒత్తిడి తేవడానికే ధర్నా’’.. అని వెల్లడించారు.