పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షెడ్యూలు కంటే ముందే నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలోని ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలు, ప్రభుత్వ వ్యూహంపై చర్చించారు. నవంబర్ 29న శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి, 12 మంది ఎంపీల సస్పెన్షన్, లఖింపూర్ ఖేరీ ఘటన, తదితర అంశాలపై ప్రతిపక్షాల రగడతో పార్లమెంట్ ఉభయ సభలు నిరంతరాయంగా ఆటంకాలు ఎదుర్కొన్నాయి.
వాస్తవంగా శీతాకాల సమావేశాలు రేపు (గురువారం) ముగియాల్సి ఉన్నప్పటికీ ఒక రోజు ముందుగానే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ, లోక్ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.