తెలంగాణలో పెద్దల సభకు వెళ్లడానికి చాలామంది పోటీ పడుతున్నారు. మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్న ఆరు ఎమ్మెల్సీ పదవులకు టీఆర్‌ఎస్ పార్టీలోని పలువురు ‘‘నాకంటే నాకు’’ అని సీఎం కేసీఆర్ ముందు తమ అభ్యర్థనలు వినిపించినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో బీసీలు, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి కనీసం రెండేసి సీట్లను ఇవ్వాలనే యోచనలో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది.
అలాగే వెలమ, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారికి చెరో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి (ఎల్.రమణ), అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి (విశ్వబ్రాహ్మణ) పేర్లు దాదాపు ఖరారయ్యాయని ప్రగతి భవన్ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది.
శాసనసభలో ప్రాతినిధ్యం లేని బీసీ సామాజికవర్గంలో పద్మ శాలి, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి కులాలకు చెందిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీ మేరకే టీటీడీపీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రచారం జరగ్గా ఆయన చేరిక సందర్భంగా కేసీఆర్ రాష్ట్రస్థాయి పదవి ఇస్తామని పరోక్షంగా హామీ ఇచ్చారు.
మరోవైపు మూడో ఎమ్మెల్సీ పదవిని కూడా బీసీకి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా కేసీఆర్ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రభుత్వ మాజీ విప్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, ఫరీదుద్దీన్, కర్నె ప్రభాకర్, పీఎల్ శ్రీనివాస్, తాడూరు శ్రీని వాస్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చే చాన్సెస్ ఉన్నాయంటున్నారు పరిశీలకులు.
రెడ్డి సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా హామీ పొందిన ఎంసీ కోటి రెడ్డి పేర్లు కూడా పెద్దసారు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
వెలమ, ఎస్సీ సామాజికవర్గాలకు చెరొకటి..
గతంలో ఇచ్చిన హామీ మేరకు వెలమ సామాజిక వర్గం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మండలిలో ఈ సామాజిక వర్గం నుంచి కల్వకుంట్ల కవిత, భానుప్రసాద్, నవీన్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో కవిత, భానుప్రసాద్ పదవీకాలం పూర్తవుతుండటంతో రవీందర్‌రావు పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
అయితే .. ఇప్పటికే కొంతమందికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పోటీ పడుతున్న వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు చాలా ఉన్నప్పటకీ.. ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. 1) ఎర్రోళ్ల శ్రీనివాస్ (ఎస్సీ), 2) మదుసూదనాచారి (బీసీ), 3) కోటిరెడ్టి (ఓసీ), 4) గుత్తా సఖేందర్ రెడ్డి (ఓసీ, గవర్నర్ కోటా), 5) రవీందర్ రావు (ఓసీ, వెలమ) 6)రమణ (బీసీ), 7) రోహీత్ రెడ్డి (ఎమ్మెల్యే కోటా ) అంతే కాకుండా పరిశీలనలో కడియం శ్రీహరి (ఎస్సీ) పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది..
గవర్నర్ కోటా నుంచి ‘కౌశిక్’ ఔట్!
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం నామినేట్ చేసింది. అయితే ఆయనపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు ఉండటంతో కౌశిక్ అభ్యర్థిత్వం నాలుగు నెలలుగా గవర్నర్ ఆమోదానికి నోచుకోలేదు. నిబంధనల మేరకు కౌశిక్ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదించే అవకాశం లేకపోవడంతో మరో అభ్యర్థిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా నుంచి తప్పించి ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి పంపడమో లేదా అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడమో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.