ఫారిన్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. కేరళ కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో 2.4 కిలోల బంగారాన్ని గుర్తించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఎయిర్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
కాగా, ఈ విమానం షార్జా నుంచి వచ్చిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అక్రమ రవాణాకు సంబంధించి విమానంలో పని చేసే మహిళా సిబ్బందిని అరెస్టు చేశామన్నారు. ఆమెను మలప్పురం ప్రాంతానికి చెందిన షహానాగా గుర్తించారు.
అయితే.. షహానా తన శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిందని అధికారులు తెలిపారు. వాటిని తన లోదుస్తుల్లో దాచిందని చెప్పారు. దీనిపై తమకు సమాచారం అందగా.. విమానం కోజికోడ్‌లో ల్యాండ్ అవ్వగానే తనిఖీలు చేపట్టినట్లు వివరించారు.