బిజెపి నేతల విమర్శలకు టీఆర్ ఎస్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. సీఎం అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ పై విరుచుకుపడ్డారు. దొడ్డిదారిన సీఎం అయిన నువ్వా మాట్లాడేది అని తలసాని ఎద్దేవా చేశారు. టిఆర్ ఎస్ పథకాలపై బిజెపి చర్చకు సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. మీ పథకాలు, మా పథకాలపై చర్చకు సిద్ధమా అని మంత్రి ప్రశ్నించారు. నాలుగుసార్లు దొడ్డిదారినే సీఎం అయ్యారని ఆరోపించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కి మంత్రి తలసాని సవాల్ విసిరారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కి దమ్ముందో లేదో ప్రధాని మోడీని అడగాలని తలసాని సూచించారు. మీస్థాయి ఏంటీ, మీకు భయపడతామా అన్నారు. మోడీలా ఎవరైనా డ్రామాలు ఆడగలరా అని తలసాని నిలదీశారు.
బీజేపీ అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అని ఆ పార్టీ అనుకుంటుందని అయితే తెలంగాణ లో మాత్రం బీజేపీ అంటే పాయిజన్ గా మారుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణలోని పథకాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలే ప్రశంసిస్తుంటే… వారు మాత్రం రాష్ట్రంలో అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నేతలు రాసిచ్చే స్క్రిప్టు అంతా ఒక్కటే అని కేవలం డబ్బింగ్ ఆర్టిస్టులు మాత్రమే మారుతున్నారని ఎద్దేవా చేశారు. నడ్డా, తరుణ్ చుగ్, శివరాజ్ సింగ్ చౌహన్ లు ఇదే స్క్రిప్టును చదువుతున్నారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేవలం మతాలు, వర్గాలు, మనుషుల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తుందని జీవన్ రెడ్డి విమర్శించారు. పంజాబ్ లో రైతుల దెబ్బకు ప్రధాని 20 నిమిషాల పాటు ఆగారని… భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఆయన అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..