భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో రాష్ట్రపతికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ లో పోలీసుల గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. కాగా రాష్ట్రపతికి ఏపీ ప్రభుత్వం తరపున సన్మానం చేశారు. అనంతరం గవర్నర్ ఇచ్చే విందుకు ఆమె హాజరుకానున్నారు. ఈమేరకు విజయవాడ పోరంకిలో మురళి కన్వెన్షన్ లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్..సీఎం జగన్ హాజరైయ్యారు. మధ్యాహ్నం 2:45కు రాష్ట్రపతి విశాఖపట్నం బయలుదేరుతారు. విశాఖలోని ఆర్ కే బీచ్ లో జరగనున్న నౌకాదళ కార్యక్రమానికి హాజరై, విన్యాసాలను తిలకిస్తారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర-రాష్ట్ర మంత్రులు, నేవీ చీఫ్ హాజరుకానున్నారు. సాయంత్రం 6.10 గంటలకు నేవీ హౌజ్ లో జరిగే నేవీ డే రిసెప్షన్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతికి రాష్ట్రపతి పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటనతో విజయవాడ, విశాఖపట్నంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ను బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. రాష్ట్రపతి ప్రయాణించే పోరంకి, నిడమానూరు ప్రధాన రహదారిపై గస్తీ పెంచారు. రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. పౌర సన్మాన కార్యక్రమం జరిగే పోరంకిలో ఐదుగురు డీఎస్పీలు, 14మంది సీఐలు, 36మంది ఎస్సైలు, 8వందల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.