ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంగల బాలిస్టిక్ మిస్సైల్ ప్రళయ్‌ని ఈరోజు భారత్ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లను సక్సెస్‌ఫుల్‌గా ఛేదించగలదు. అదేవిధంగా 500 కేజీల నుంచి 1000 కేజీల వరకు బరువును మోసుకెళ్లగల కెపాసిటీ దీనికి ఉంది.
ప్రళయ్ క్షిపణి ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూపొందించిన పృథ్వి డిఫెన్స్ వెహికిల్‌ను ఆధారంగా చేసుకుని ఈ ప్రళయ్ మిస్సైల్‌ని రూపొందించారు. ఉదయం 10.30 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి దీన్ని పరీక్షించారు. కాగా, క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో బృందాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.