ఎనిమిది మందితో ప్రయాణిస్తోన్న విమానం అట్లాంటికా సముద్రంలో కూలిపోయింది. ఈ దుర్ఘటన నార్త్ కరోలినా రాష్ట్రం ఔటర్ బ్యాంక్స్ సమీపంలో చోటు చేసుకుంది. కాగా ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మిగిలిన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. హైడ్ కౌంటీ ఎయిర్ పోర్ట్ నుంచి పిలాటస్ పీసీ-12/47 అనే సింగిల్ ఇంజన్ విమానం టేకాఫ్ అయింది. అయితే టేకాఫ్ అయిన 25 నిమిషాల తర్వాత Aircraftకు రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. దాంతో విమానం సముద్రంలో కూలిపోయిందని నిర్ధారించుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. బోట్స్, హెలికాప్టర్లను రంగంలోకి దించి ముమ్మరంగా గాలించింది. ఆ క్రమంలో సముద్రంలో మూడు వేర్వేరు చోట్ల విమాన శకలాలు దొరికాయి. అక్కడే కోస్ట్ గార్డ్ సిబ్బంది ఒక మృతదేహాన్ని కూడా గుర్తించింది. కాగా, విమానంలోని ఎనిమిది మందిలో ఎవరూ బతికి బయట పడే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరూ కార్ టెరెట్ కౌంటీకి చెందిన వారని సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..