దేశంలో చాలామంది పలురకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, అవయవ మార్పిడి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటే, అవయవదాతల సంఖ్య మాత్రం వందలు.. వేలల్లోనే ఉంటోంది. ఫలితంగా చాలామంది సమయానికి అవయవమార్పిడి జరగక ఇబ్బంది పడుతున్నారు. అవయవదానంపై అవగాహన పెంచేందుకు ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతిబాబు ముందుకొచ్చారు. తన జన్మదినం సందర్భంగా మరణానంతరం తాను అవయవదానం చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు నాడు తమ మరణం గురించి మాట్లాడేందుకు ఇష్టపడరు. అలాంటిది, అవయవదానంపై సామాన్యప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు జగపతిబాబు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు.. ఆయన అభిమానులు మరో 100 మంది వరకు తాము సైతం అవయవదానం చేస్తామని వేర్వేరు చోట్ల ప్రతిజ్ఞ చేశారు.
నేను చేస్తున్నా.. మీరూ ముందుకు రండి
జన్మదినం సందర్భంగా ఏదైనా పదిమందికీ ఉపయోగపడే కార్యక్రమం చేయాలనుకున్నానని, కానీ అన్నింటికంటే అవయవదానం ప్రతిజ్ఞ అయితే మరింతమందికి స్ఫూర్తి కలిగిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నారు. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, కళ్లు, చర్మం, చేతులు.. ఇలా ఎన్నో రకాల అవయవాలను మరణానంతరం వేరేవారికి అమరిస్తే వాళ్లకు కొత్త జీవితం లభిస్తుందని ఆయన అన్నారు. తన అభిమానులంతా అవయవదానం చేయడానికి ముందుకురావాలని జగపతిబాబు పిలుపునిచ్చారు. దీనివల్ల మరణించిన తర్వాత కూడా అమరులుగా మిగిలిపోతారని చెప్పారు. కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర పరిశ్రలు, వాణిజ్యం, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జీవన్‌దాన్ ఇన్‌ఛార్జి, నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత, అవయవమార్పిడి నిపుణులైన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో అవయవదానం చేసిన పలువురి కుటుంబసభ్యులను ఘనంగా సన్మానించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..