తాళం వేసిన ఇళ్లల్లో సులువుగా చోరీలకు పాల్పడే హౌస్ బ్రోకర్ ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుండీ రూ. 24 లక్షలు విలువ చేసే 52.46 తులాల బంగారు నగలు, 800 గ్రాముల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు, రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, తదితర వ్యసనాలకు బానిసై వాటిని తీర్చుకునే క్రమంలో దొంగగా అవతారమెత్తినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గత ఏడాది జనవరి నెల నుండీ ఇప్పటి వరకు అనంతపురం, చుట్టుపక్కల ప్రాంతాలలోని 29 ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఇ.నాగేంద్రుడు అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి, నాల్గవ పట్టణ సి.ఐ కత్తి శ్రీనివాసులులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుడు ఉప్పర ఆది శ్రీనివాసులు ,శీను, వయస్సు 25 సం.లు, ఉప్పరపల్లి గ్రామం అతనిదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..