కేంద్రమాజీ న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ పంపారు. ఆ లేఖలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారు. పార్టీలోపల కంటే.. పార్టీ బయటే ఉండే బాగా సేవ చేయగలనని ఆయన పేర్కొన్నారు. బాగా ఆలోచించి, అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అశ్విని కుమార్ కాంగ్రెస్ పార్టీలో 46 ఏళ్లు పాటు పనిచేశారు. ఇన్నేళ్ల తర్వాత పార్టీతో తన అనుబంధానికి ముగింపు పలికారు. 69 ఏళ్ల అశ్విని కుమార్ అనేక బాధ్యతలను నిర్వర్తించారు. దేశంలోని అతి పిన్న వయస్కుడైన అదనపు సొలిసిటర్ జనరల్‌లో ఒకరిగా పనిచేశారు. అలాగే పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో అనేక శాఖల బాధ్యతలను నిర్వహించారు. అక్టోబర్ 2012 నుంచి మే 2013 వరకు న్యాయ శాఖ మంత్రిగా, జనవరి 2011 నుంచి మే 2013 వరకు ప్రణాళిక మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 2011 జనవరి నుంచి జూలై వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా, విచార్ విభాగ్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. అంతేకాదు భోపాల్ గ్యాస్ ట్రాజెడీ కేసుతో సహా భారతదేశ సుప్రీంకోర్టు ముందు ముఖ్యమైన కేసులను వాదించారు.ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడం ఆ పార్టీకి మింగుడుపడని విషయమే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..