మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో 12వ తరగతి (హెచ్ఎస్సి) మహారాష్ట్ర బోర్డు పరీక్షకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను తీసుకెళ్తున్న ట్రక్కులో మంటలు చెలరేగడంతో ప్రశ్నపత్రాలన్నీ దగ్ధమయ్యాయి. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (MSBSHSE)లోని పూణే డివిజన్ ప్రశ్నపత్రాలను ఎంపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా ట్రక్కు మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర బోర్డు 12వ తరగతికి ఆఫ్‌లైన్ పరీక్ష మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది .ఈ విషయమై బోర్డు చైర్మన్ శరద్ గోసావి మాట్లాడుతూ.. 12వ తరగతి ప్రశ్నాపత్రం సెట్‌తో వెళ్తున్న ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అహ్మద్‌నగర్ జిల్లాలోని సంగమ్నేర్ ఘాట్ సమీపంలో, అగ్నిప్రమాదం కారణంగా, అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు ఉన్న పెట్టెలు ధ్వంసమయి .. రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయని తెలిపారు.
ఇదే అంశంపై అహ్మద్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ పాటిల్ మాట్లాడుతూ ..ట్రక్కు కదులుతున్నప్పుడు, దాని నుండి ప్రమాదకరమైన పొగ రావడం ప్రారంభమైంది. వెంటనే ట్రక్కులో నుంచి డ్రైవర్, ఇతర ప్రయాణికులు దూకారు. చూస్తుండగానే లారీలో మంటలు చెలరేగి ప్రశ్నపత్రాలన్నీ దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘాట్ స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు పాటిల్ తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..