Press Meet: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది ఎంతో.. సీఎం కేసీఆర్ చెప్పేది ఏమిటో అందరికీ తెలుసని.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎంపీ, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాలపై బండి సంజయ్ సమాధానమిచ్చారు. ఢిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తామన్నారు. ఎక్కడ చేశారని ప్రశ్నించారు సంజయ్.
నిన్నటి కేసీఆర్ ప్రెస్‌మీట్ సందర్భంగా అంతా పెట్రోలు చార్జీలు తగ్గిస్తారని ఎదురుచూశారని, కానీ సీఎం అటువంటిదేమీ చెప్పలేదని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 2015లో పెట్రలోల్‌పై 4శాతం వ్యాట్ పెంచింది తెలంగాణ సర్కారు కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు తగ్గించడానికి ఎందుకు మనసు రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2,52,908 కోట్లు ఇచ్చిందని, కానీ సీఎం కేసీఆర్ 40 వేల కోట్లు ఇచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారన్నారు.
దేశంలోని 24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించి పెట్రో రేట్లపై ఊరట కల్పించాయి. మరి తెలంగాణ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. వ్యాట్ అధికంగా వసూలు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్‌లో ఉందన్నారు. పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చుతామంటే ఎవరు వద్దన్నారని నిలదీశారు.
రైతులను తెలంగాణ ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని కొత్త చట్టంలో ఎక్కడ రాసుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇప్పటిదాకా రుణమాఫీ అమలు చేయలేదన్నారు. పైగా వరి వేయొద్దని, ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టాలని తెలంగాణ సర్కారు చూస్తోందన్నారు. పనులు లేక యువత అంతా గ్రామాల్లో ఉపాధి పనులకు వస్తున్నారని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఉద్యోగాల కల్పనకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించారు బండి సంజయ్.