కేంద్రం తీరుకు నిరసనగా ఎల్లుండి (18వ తేదీన) ఇందిరాపార్క్ దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి ధర్నా చేస్తామని, బీజేపీ నేతల అడ్డగోలు మాటలు, అరాకిరి మాటలు.. కొనుగోలు కేంద్రాల దగ్గర డ్రామాలు చేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ధర్నాలో స్వయంగా తానే పాల్గొంటానని సీఎం అన్నారు. ఇక మీదట బీజేపీని వెంటాడుతాం.. వేటాడుతాం అని రైతులకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టేది లేదన్నారు కేసీఆర్.
తెలంగాణ రైతులను కడుపుల పెట్టుకుని చూసుకుంటాం. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎవరూ నష్టపోవద్దన్నదే ప్రభుత్వం ఆలోచన. అందుకనే ఈసారి వరి సాగు తగ్గించాలని కోరుతున్నా అని సీఎం కేసీఆర్ అన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు గాయి గాయి చేస్తున్నారని, రైతులు వాళ్ల మాటలు విని ఆగం కావద్దని కేసీఆర్ సూచించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రానికో మాట, పూటకో మాట.. మనిషికో మాట చెబుతున్నారని, పంజాబ్ రైతుల వడ్లు కొన్నట్టే తెలంగాణ నుంచి కూడా కొనుగోలు చేయాలని వ్యక్తిగతంగా వెళ్లి కోరినా రెస్పాన్స్ రావడం లేదన్నారు కేసీఆర్..
అయినా మరోసారి ప్రధాని మోడీకి, సంబంధిత మంత్రికి లేఖ రాశానని, యాసంగి వడ్లు కొనుగోలు చేస్తామని స్పష్టంగా తెలియజేయాలని కోరినట్టు తెలిపారు.