ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ- 2022లో కొవిడ్-19 కలకలం రేపింది. భారత్‌కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో వారు టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) తెలిపింది. కరోనాబారిన పడ్డవారిలో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రిథికా రాహుల్, థెరిసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, కుషి గుప్తాలు ఉన్నారు.
“ఆటగాళ్లకు మంగళవారం నిర్వహించిన ఆర్టీ- పీసీఆర్ పరీక్షలో ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఏడుగురితో సన్నిహిత సంబంధాలున్న ఆటగాళ్లందరినీ టోర్నీ నుంచి తప్పించాం. కరోనా సోకిన ప్లేయర్స్‌కు బదులు ఎవరినీ తీసుకోం. ప్రత్యర్థి ఆటగాళ్లను తదుపరి రౌండ్‌కు పంపిస్తాం.” అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. గురువారం తెల్లవారుజామున బీడబ్ల్యూఎఫ్ ఈ విషయాన్ని తెలిపింది. కానీ, కొవిడ్ సోకిన ప్లేయర్స్ లిస్ట్ మాత్రం వెల్లడించలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు రోజూ ఆటగాళ్లకు కొవిడ్-19 టెస్టులు నిర్వహిస్తున్నారు.